TS Rains: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు... కరీంనగర్ లో ఈదురుగాలుల ధాటికి నేల కూలిన భారీ కటౌట్... నిజామాబాద్ లో వడగండ్ల వాన
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వరుణుడు ఉగ్రరూపం చూపాడు. భారీ ఈదురుగాలులు, వడగండ్ల వానలు కురిశాయి. ఈదురుగాలుల ధాటికి కరీంనగర్ లో భారీ కటౌట్ నేలకూలింది.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. కరీంనగర్ లో బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాటు చేసిన 70 అడుగుల భారీ లైటింగ్ సెట్టింగ్ ఈదురుగాలులు, వర్షానికి కుప్ప కూలింది. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న తెలంగాణ చౌక్ వద్ద రాముడి పట్టాభిషేకం ఆవిష్కరించేలా భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో ఈ కటౌట్ ఆకర్షణీయంగా ఉండేది. రోజు అటుగా వెళ్తున్న జనాలకి ఆ ప్లేస్ ఒక ఆకర్షణీయ ప్రదేశంగా మారింది. ప్రజలు అక్కడ చేరి కొద్దిరోజులుగా సెల్ఫీలను సైతం దిగుతున్నారు. ఇవాళ కురిసిన భారీ వర్షానికి హోర్డింగ్ ఒక్కసారిగా కప్పుకూలింది. హోర్డింగ్ కూలిన సమయంలో భారీ వర్షం పడుతుండడంతో ఆ ప్రదేశంలో ఎవరు లేకపోవడం పెను ప్రమాదం తప్పింది.
రూ.45 లక్షల వ్యయంతో హోర్డింగ్ ఏర్పాటు
ఈదురు గాలుల ధాటికి విద్యుత్ దీపాల అలంకరణ లుమినార్ నేలకూలింది. ఫిబ్రవరిలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో రాముడి పట్టాభిషేకాన్ని ఆవిష్కరించేలా సుమారు రూ.45 లక్షలు పెట్టి ఈ భారీ హోర్డింగ్ ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని చొప్పదండి, రామడుగు, మానకొండూరు, పెద్దపల్లి, శంకరపట్నం మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. రాజన్న సరిసిల్ల జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. భారీ స్థాయిలో గాలులు వీయడంతో సిరిసిల్ల విద్యానగర్‌లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి.
Also Read: ప్రగతి భవన్‌కు బీహార్ ప్రతిపక్ష నేత.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ కీలక చర్చలు ...
నిజమాబాద్ లో వడగండ్ల వాన
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇవాళ వడగండ్ల వాన కురిసింది. ఆకాశం నుంచి రాళ్లు పడుతున్నాయా అన్న రీతిలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. భారీ సైజులో మంచు గడ్డలతో వర్షం కురిసింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి, నల్లవెల్లి, గౌరారం గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.