Telangana Rains: తెలంగాణలో ఏడాదిలో పడాల్సిన వాన ఒక్కరోజే- రికార్డు స్థాయిలో వర్షాలు
Telangana Rains: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఒక సంవత్సరం పాటు నమోదు అయ్యే వర్షపాతం మించి ఒకరోజులోనే నమోదు అవుతున్నట్టు అధికారిక అంచనాలు ఉన్నాయి
Telangana Rains: తెలంగాణలో భీకర వర్షాలు పడుతున్నాయి. మొన్నటి వరకు లోటు వర్షపాతంలో రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రికార్డు స్థాయిలో పడుతున్న వర్షం అందర్నీ టెన్షన్ పెడుతోంది. ఇప్పటి వరకు అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం సంవత్సరం మొత్తం పడాల్సిన వర్షం ఒక్కరోజులోనే నమోదైనట్టు తెలుస్తోంది.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఒక సంవత్సరం పాటు నమోదు అయ్యే వర్షపాతం మించి ఒకరోజులోనే నమోదు అవుతున్నట్టు అధికారిక అంచనాలు ఉన్నాయి. వరంగల్ , భూపాలపల్లి , హనుమకొండతో పాటు పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం నమోదవుతుంది. ములుగు జిల్లాలో 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 61 సెంటీమీటర్ల రికార్డు అయ్యాయి. హైదరాబాదులో కూడా పలు ప్రాంతాల్లో 100mmపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రికార్డు స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో రాత్రి 12 గంటల సమయానికే 350 mm వర్షపాతం నమోదైంది.
భారీగా కురుస్తున్న వర్షాలకు రహదారులు తెగిపోయాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు చేరుకుంటోంది. స్థాయికి మించిన నీటితో ప్రాజెక్టుల వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
పరిస్థితి ప్రమాదకరస్థాయిలో ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చాలా ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిషేధించారు. పాల్వంచ నుంచి భద్రాచలం వెళ్ళు రహదారి మధ్యలో ఉన్న నాగారం బ్రిడ్జి వద్ద కిన్నెరసాని ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. బ్రిడ్జి మీదుగా భారీ వాహనాల రాకపోకలు అధికారులు నిలిపివేశారు. కొత్తగూడెం నుంచి భద్రాచలం వైపు వెళ్లేవారు, భద్రాచలం నుంచి కొత్తగూడెం, ఖమ్మం వెళ్తున్న వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు.
గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 50.2 అడుగులు దాటింది. భద్రాచలం వద్ద ఔట్ ఫ్లో 13 లక్షల క్యూసెక్కులు దాటింది. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పెరుగుతోంది. ప్రాజెక్టుకు 48 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా వరద నీరు ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 11.70 అడుగులకు చేరింది. బ్యారేజ్ నుంచి 9 లక్షల 88 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
గోదావరి ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లంక గ్రామాలను అప్రమత్తం చేశారు. గుబ్బల మంగమ్మ ఆలయాన్ని మూసివేశారు. వేలేరుపాడు, కుక్కనూరు మండలాల్లో రాకపోకలు నిషేధించారు.