Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో చర్చకు జీఎస్టీ స్కామ్! అరెస్టులపై ఊహాగానాలు!
Telangana News: తెలంగాణలో ఇప్పుడు జీఎస్టీ స్కామ్ చర్చనీయాంశం అవుతోంది. ఇందులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా 5వ నిందితుడిగా ఉన్నారు. జీఎస్టీ స్కామ్‌ను అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
GST scam in Telangana: తెలంగాణలో కమర్షియల్ ట్యాక్స్ స్కామ్‌లో రాష్ట్ర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సీసీఎస్‌లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. రూ.1400 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా భావిస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా ఈ కుంభకోణంలో చిక్కుకున్నారు. ఏ -5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరును సీసీఎస్ పోలీసులు చేర్చారు. మాజీ సీఎస్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఆధారాలను సేకరించగా.. దాదాపు 75 మంది ట్యాక్సులు చెల్లింపుదారులు కార్యకలాపాల వివరాలను నిందితులు ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేసినట్లు తెలిసింది. పన్ను ఎగవేతకు నిందితులు బాగా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. కమర్షియల్ ట్యాక్స్, హైదరాబాద్ ఐఐటీ మధ్య జరిగిన లావాదేవీలను కూడా పక్కదారి పట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఐఐటీకి చెందిన సాఫ్ట్‌వేర్‌లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సప్ గ్రూప్‌కు చేరేలా ఆదేశాలు అందాయని.. ఆ గ్రూప్‌లో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ఉన్నట్లు గుర్తించారు.
కోమటిరెడ్డి - జగదీష్ రెడ్డి మధ్య దుమారం
మరోవైపు నేటి అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై చర్చ జరిగింది. క్రమంగా ఈ చర్చ వాడివేడిగా సాగింది. మాజీ విద్యుత్ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య వాగ్యుద్ధం నడిచింది. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు పాలనలో విద్యుత్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ మొత్తం మీరు ఇచ్చింది 7700MW అయితే.. కేసీఆర్ వచ్చిన తర్వాత 10 ఏండ్లలో 11000 MW ఇచ్చారు. 2/6/2014 నాటికి తెలంగాణలో విద్యుత్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ 7778 MW అయితే మొన్న 1/1/2024 వరకు 19483 MW ఇచ్చారు.. అంటే 11705 MW కేసీఆర్ నాయకత్వంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెరిగింది. వీళ్ల 70 ఏండ్ల కాలంలో వీళ్లు ఇచ్చింది 74 MW.. కేసీఆర్ వచ్చిన తర్వాత 6132 MW 1/1/2024 నాటికి మేము తీసుకు వచ్చాం.
గ్రిడ్ కన్సంప్షన్ 2/6/14 నాడు మీరు ఇచ్చింది 128 మిలియన్ యూనిట్లు.. కానీ కేసీఆర్ నాయకత్వంలో 297.89 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఈ రాష్ట్ర ప్రజలకు అందించం. పర్ క్యాపిట కన్సంప్షన్ ఆనాడు 1196 KW యూనిట్స్.. కానీ మేము దిగిపోయినప్పుడు 2349 KW యూనిట్లు.. రెండు ఇంతలకు పైగా పెరిగింది. 2/6/2004 నాటికి వాళ్లు ఆరు సబ్ స్టేషన్లు నిర్మాణం చేస్తే మేము 22 400 KV సబ్ స్టేషన్లు నిర్మాణం చేశాం. 220 KV సబ్ స్టేషన్లు వీళ్లు 51 ఇచ్చి పోతే.. మేము 53 కలిపి 104 చేశాం. 130 KV సబ్ స్టేషన్లు ఆనాడు 176 ఇవాళ 252’’ అని అన్నారు.
క్రమంగా ఈ చర్చ వ్యక్తిగత ఆరోపణలపైకి మళ్లింది. నల్గొండలో జగదీశ్ రెడ్డికి క్రిమినల్ రికార్డు ఉందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. దీంతో మంత్రి ఆరోపణలపై సవాల్‌కు సిద్ధమని జగదీశ్‌రెడ్డి అన్నారు. తాను కూడా ఛాలెంజ్‌కి సిద్ధమేనంటూ మంత్రి సవాల్ చేశారు. హత్యకేసులో జగదీశ్ రెడ్డి 16 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగారని, నిరూపించలేకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి సవాలు చేశారు.