TS News Developments Today: నేడు మధ్యాహ్నం 12:47 గంటలకు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మధ్యాహ్నం 12:47 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. కేంద్ర కార్యాలయంలో మొదట కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.
నేడు మధ్యాహ్నం 12:47 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మధ్యాహ్నం 12:47 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. కేంద్ర కార్యాలయంలో మొదట కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం కార్యాలయం ప్రారంభోత్సవం చేసి, కేసీఆర్ తన గదిలో కూర్చుంటారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా హాజరు కానున్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. కేసీఆర్‌తో భావసారూప్యం కలిగిన జాతీయ నాయకులను ఆహ్వానించామని చెప్పారు. ఈ రోజు నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో యాగాలు జరుగుతున్నాయి.
నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు టీ కాంగ్రెస్ పిలుపు
తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసుల దాడిని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎదురుగా ధర్నా చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ముగింపునకు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర
బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజాసంగ్రామయాత్ర ఈరోజు గంగాధర నుండి మొదలై కొత్తపల్లి వరకు కొనసాగనుంది. ఇందులో నారాయణపూర్ చెరువు ముంపు గ్రామాల బాధితుల సమస్యలు వినడంతోపాటు.. వివిధ వర్గాల ప్రజలతో బండి సంజయ్ మమేకం కానున్నారు. ఈ పాదయాత్రలో బండి సంజయ్ కురిక్యాల, కోట్ల నరసింహుల పల్లె, కొండన్నపల్లి, దేశరాజు పల్లి, వెదిర మీదుగా కొత్తపల్లి చేరుకోనున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయిదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపటితో ముగియనుండడంతో పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకులు కరీంనగర్ కి చేరుకుంటున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభకు హాజరు కానుండడంతో భారీ జన సమీకరణ చేసి సక్సెస్ చేయడం ద్వారా టిఆర్ఎస్ కి సవాల్ విసరాలనీ బిజెపి భావిస్తోంది. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ముగింపు సభ జరగనుంది.
కన్వీనర్ కోటాలో బీడీఎస్ సీట్ల భర్తీకి నేడు, రేపు వెబ్‌కౌన్సెలింగ్
ప్రభుత్వ, ప్రైవేట్ దంత కళాశాలల్లో కన్వీనర్ కోటా బీడీఎస్ ప్రవేశాలకు మాప్ ఆప్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. రెండవ విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఈనెల 14న బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 15వ తేది సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్ధులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ WWW.KNRUHS.TELANGANA.GOV.IN లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.
16 నుంచి యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాలు
పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభంకానున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీతారెడ్డి తెలిపారు. 2023 జనవరి 15వ తేదీ వరకు 30 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి రోజు ఉదయం 4.30 నుంచి 5.15 గంటల వరకు ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో అమ్మవారికి తిరుప్పావై కార్యక్రమం వైభవంగా జరుపుతామని, ఉత్సవాల్లో భాగంగా జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదాదేవి కల్యాణం, 15న ఉదయం 11.30 గంటలకు ఓడి బియ్యం కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలు పరిసమాప్తం పలుకుతారని ఆమె వివరించారు.
షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
YSRTP అధినేత షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్రను అడ్డుకుంటున్నారంటూ షర్మిల తరపున లాయర్ హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈపిటిషన్ పై విచారించిన మైకోర్టు ఆమె పాదయాత్రకు అనుమతించింది. ఇదిలా ఉంటే లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించారు. షర్మిలను హైకోర్టుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. తనను హౌజ్ అరెస్ట్ చేశామంటున్నారని.. నోటీసులు ఇవ్వకుండా తనను అడ్డుకోవడం ఏమిటని షర్మిల ఫైరయ్యారు.