(Source: Poll of Polls)
TS Mlc Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్, ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవం!
TS Mlc Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
TS Mlc Elections : తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగిసింది. ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థులను ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవం అయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ఈ ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం అయినట్లు ధ్రువీకరణ పత్రాలను అందిచారు.
ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం
ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల పరిశీలన పూర్తయ్యే సరికి నాలుగు నామినేషన్లు దాఖలు అవ్వగా అందులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన పాలమూరి కమల నామినేషన్‌ను తిరస్కరణకు గురైంది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థులు చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, నవీన్‌కుమార్ నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. అప్పట్లోగా బరిలో ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే ఉండటంతో ఆ ముగ్గురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.
మాజీ రాష్ట్రపతి మనవడు
చల్లా వెంకట్రామిరెడ్డి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు. ఆయన జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004 నుంచి 2009 వరకు ఆయన అలంపూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఏడాది డిసెంబర్‌లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చల్లా వెంకట్రామిరెడ్డికి బీఆర్ఎస్ అవకాశమిచ్చింది. తెలంగాణ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ దేశపతి గోపాలకృష్ణశర్మ, బాల సరస్వతి దంపతులకు సిద్దిపేట జిల్లా మునిగడపలో 1970లో జన్మించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ నిర్వహించిన సభలు, ర్యాలీల్లో దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన, సీఎం ఓఎస్డీగా పని చేస్తున్నారు.
నవీన్ కు మరోసారి అవకాశం
హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన నవీన్ కుమార్ 1978 మే 15న కొండల్‌రావు, తిలోత్తమ దంపతులకు జన్మించారు. నవీన్ కుమార్ తాత రామచంద్రరావు గతంలో మంత్రిగా పనిచేశారు. 2001 నాటి జలదృశ్యం ఆవిర్భావసభతో మొదలుపెట్టి టీఆర్‌ఎస్ అన్ని సమావేశాల్లో నవీన్ యాక్టివ్ గా పనిచేశారు. హైదర్ నగర్‌లో తన సొంత ఖర్చులతో శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించారు. 2019 మే నెలలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఈ మార్చిలో ఆయన పదవీకాలం పూర్తవనుంది. నవీన్ సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్, మరోసారి ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఫలితాల కౌంటింగ్ లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తి అవ్వగా... మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డికి 7505 ఓట్లు రాగా, చెన్నకేశవ రెడ్డికి 6584 ఓట్లు వచ్చాయని ఈసీ అధికారులు ప్రకటించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డి 921 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏవీఎన్ రెడ్డికి 50 శాతానికి పైగా ఆధిక్యం వచ్చిందని అధికారులు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 452 చెల్లని ఓట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు అధికారులు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎన్నికల సిబ్బంది ఎలిమినేషన్ చేస్తారు.