Ministers Madigadda Tour : కేసీఆర్ తప్పిదాల వల్లనే కాళేశ్వరానికి గండం - మేడిగడ్డను పరిశీలించిన తెలంగాణ మంత్రులు
Ministers : కాళేశ్వరం ప్రాజెక్టు అంతా కేసీఆర్ తప్పిదాల వల్లే పనికి రాకుండా పోతోందని మంత్రులు మండిపడ్డారు. కుంగిన మేడిగడ్డ ప్రాంతాన్ని నలుగురు మంత్రులు పరిశీలించారు.
Ministers Madigadda Tour : కాళేశ్వరం మొత్తం ప్రపోజల్ అంచనా వ్యయం లక్షా 28 వేల కోట్లు అని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.93,800 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్‌ను నలుగురు మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా కాళేశ్వరంపై నీటిపారుదల శాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలుమూరు ప్రాజెక్టుకు కూడా కాళేశ్వరం పేరుతో అప్పులు తీసుకొచ్చారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ పూర్తికావడానికి అదనంగా 15 వేల కోట్లు కు పైగా అవసరం పడిందన్నారు. ఏడాదిన్నర కాలంగా మూడు వేల కోట్లకు పైగా కాళేశ్వరం బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అక్టోబర్ 21 నాడు సాయంత్రం పెద్ద సౌండ్ వచ్చిందని, కుట్ర కోణంగా అనుమానంతో ఫిర్యాదు చేశామని ఇఎన్‌సి అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదిత స్టోరేజ్ కెపాసిటీ 141 టిఎంసిలుగా ఉందని, ఇప్పటివరకు కాళేశ్వరం కింద 98,570 ఎకరాలు సాగు చేశామని పేర్కొన్నారు. మూడో టిఎంసి కోసం మరో 33400 కోట్లతో ప్రతిపాదన చేశామని వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మించాక ప్రధానంగా ఇచ్చింది స్థీరకరణ మాత్రమేనన్నారు. భూసేకరణ సమస్యలతో కొత్త ఆయకట్ట కష్టమేనని చెప్పారు. రెండు టిఎంసిల లిప్టింగ్‌కు కేవలం ఐదు వేల మెగావాట్ల కరెంట్ అవసరం వచ్చిందని, మూడో టిఎంసి పనులు చేస్తే మొత్తం 8450 మెగావాట్ల కరెంట్ అవసరం పడుతుందన్నారు. ఈ ఐదేళ్లలో కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసి 173 టిఎంసిలు మాత్రమేనని, రెండు టిఎంసిల కెపాసిటీలకే 94 వేల కోట్లతో ప్రతిపాదన ఇచ్చామన్నారు. మూడు టిఎంసి కోసం మరో 33400 కోట్లతో ప్రతిపాదనలు తీసుకొచ్చామన్నారు.
గ్రావిటీ వదిలేసి లిఫ్ట్ డిజైన్ చేసి తప్పు చేశారన్న మంత్రులు
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్ల పరిశీలిన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. ‘కాళేశ్వరం కంటే ప్రాణహితే ఉత్తమమైనది. మహారాష్ట్ర కొంత ముంపుతో ప్రాణహిత పూర్తి అయ్యేది. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80వేల కోట్లకు పెంచారు. కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టుకు రూ.90వేళ కోట్లు ఖర్చు చేశారు. మేడిగడ్డ కుంగడమే కాదు.. అన్నారం బ్యారేజీ కూడా డ్యామేజీ అయింది. ఇంకా సుందిళ్లను పరిశీలించాల్సి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు ఇంజినీర్ల సలహాలు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్నారా? లేక చీఫ్ ఇంజినీర్‌గా పని చేశారా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ బంధువు కోసం మూడో టీఎంసీ పనులు
మూడో టిఎంసి అవసరం లేదని, మూడో టిఎం సి కెసిఆర్ బంధువు కోసం చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఇంజినీర్లుగా సలహాలు ఇవ్వాలని కానీ వినకపోతే సెలవు పెట్టి పోవాలని సూచించారు. కొండ పోచమ్మ ఎప్పుడూ నిండుగా ఉంటుందని, ఫామ్‌హౌస్‌కు తప్పితే ఇతర పొలాలకు నీరు పోదని చురకలంటించారు. ఇంత ఖర్చు చేసినా ఎంత ఆయకట్టుకు నీరు వెళ్తోందో చెప్పడంలేదని మంత్రి చురకలంటించారు. ఫామ్ హౌస్ తప్ప ఇతర పొలాలకు నీరు పోదు. ఇంత ఖర్చు చేసినా ఎంత ఆయకట్టుకు నీరు వెళ్తోందని ప్రశ్నించారు.
కొత్త పిల్లర్లు నిర్మించే యోచన
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్‌పై దృష్టి పెట్టిన ప్రభుత్వం వీలైనంత తొందరగా దాన్ని రిస్టోర్ చేయాలని భావిస్తున్నది. బ్యారేజీలోని ఏడవ బ్లాకులో 16-20 పిల్లర్లు దెబ్బతిన్నందున వాటిని పూర్తిగా ధ్వంసం చేసి కొత్త నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నదన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడున్న స్ట్రక్చర్ ఉపయోగానికి అనువుగా లేనందున కొత్తది కట్టడం అనివార్యమని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం దెబ్బతిన్న పిల్లర్లను తొలగించడానికి, పక్కన ఉన్న బ్లాక్‌లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎలాంటి విధానాన్ని అనుసరించాలన్నదానిపై సాంకేతిక చర్చలు కంప్లీట్ అయ్యాయి.