Minister Sabitha Indra Reddy: ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది... విద్యాసంస్థల్లో కరోనా కేసులపై ఆందోళన వద్దు... మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ విద్యాసంస్థల్లో కరోనా కేసులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.
తెలంగాణలోని విద్యాసంస్థలో కరోనా కలకలం రేపుతోంది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా కరీంనగర్ లోని ఓ వైద్యకళాశాలలో 49 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. విద్యా సంస్థల్లో కరోనా కేసులపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు లేవన్నారు. పాఠశాలలు, వసతి గృహాల్లో కరోనా నిబంధనలు పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధ్యాయులకు రెండు డోసులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్‌పై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం మంత్రి సమీక్షించారు.
Also Read: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం... 42 మంది విద్యార్థులకు పాజిటివ్...
వ్యాక్సినేషన్ పై అవగాహన
రంగారెడ్డి జిల్లాలో స్థానికులు, స్థానికేతరులందరికీ రెండు డోసుల వ్యాక్సిన్స్ అందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రెండో డోసు విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవన్న మంత్రి... కేసుల నమోదుపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. కొన్ని పాఠశాలల్లో స్పల్పంగా కేసులు నమోదు అయ్యాయన్నారు. వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తిచేయాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు రెండు డోసులు తప్పక తీసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఇప్పటికే విద్యార్థులు రెండేళ్లు కోల్పోయారు
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి సబితా అధికారులను ఆదేశించారు. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనా కారణంగా విద్యార్థులు ఇప్పటికే రెండేళ్లు కోల్పోయారన్నారు. విద్యార్థుల భవిష్యత్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనుకోని పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి