Minister Niranjan Reddy: మంగళవారం మరదలమ్మా వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ... పశ్చాత్తాపం వ్యక్తం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి..
మంగళవారం మరదలమ్మా వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తాను ఎవరి పేరుతో వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన మాటలు సంస్కారవంతులకు సంస్కారంగానే అర్థం అవుతాయన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల గురించి మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం మరదలమ్మా అని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల భర్తీకి డిమాండ్ చేస్తూ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహారదీక్ష చేస్తున్నారు. నాగర్ కర్నూల్‌లో టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడిన నిరంజన్ రెడ్డి షర్మిలపై విమర్శలు చేశారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలుదేరారన్నారు. ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలనే ఆమె డిమాండ్ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపించారు.
Also Read: హుజూరాబాద్ లో లెటర్ల లొల్లి.. దళిత బంధు ఆపింది ఈటలే అంటున్న టీఆర్‌ఎస్.. కాదు.. కాదంటున్న బీజేపీ
ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం
మంగళవారం మరదలమ్మా వ్యాఖ్యలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఎవరి పేరుతో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఏకవచనం కూడా వాడలేదన్నారు. చివరన అమ్మా అని కూడా అన్నానని మంత్రి వివరించారు. ఈ వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగిస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. తన మాటలు సంస్కారవంతులకు సంస్కారంగానే అర్థమవుతున్నాయన్నారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె కంటే పెద్దదన్నారు. తన సోదరి కంటే చిన్నదని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ను ఏకవచనంతో సంబోధించడం సంస్కారం కాదన్నారు. ఈ విషయంపై టీఆర్ఎస్ శ్రేణులు సరైన స్పందిస్తాయన్నారు.
Also Read: ‘వరి-ఉరి’ పేరుతో బండి సంజయ్ దీక్ష.. మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్
తెలంగాణపై కేంద్రం వివక్ష
వరి కొనుగోళ్లపై బీజేపీ నేతలు బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తాను సవాల్ విసిరితే బీజేపీ నేతలు దీక్షలు చేసి పారిపోయారన్నారు. కేసీఆర్ రైస్ మిల్లర్ల ప్రభుత్వం అని బీజేపీ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. రైస్ మిల్లర్ల ప్రభుత్వమో రైతుల అనుకూల ప్రభుత్వమో ప్రజలకు తెలుసన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం దళారీ పాత్ర అని ఒక బీజేపీ నేత అంటారని, మోదీ కూడా సీఎంగా చేశారని, ఆయన కూడా దళారీ పాత్ర పోషించారా అని ప్రశ్నించారు. మద్దతు ధరతో పాటు పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రానికి ఉన్న రాజ్యాంగ బాధ్యత అని గుర్తుచేశారు. కేంద్రం తన బాధ్యతను విస్మరిస్తోందన్నారు. పంజాబ్ లో ధాన్యమంతా కొంటున్న కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపుతుందన్నారు. పంజాబ్ ఇండియాలో భాగం.. తెలంగాణ కాదా అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందన్నారు. హుజురాబాద్ లో బీజేపీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.
Also Read: షర్మిలపై మంత్రి నిరంజన్ రెడ్డి అసభ్య వ్యాఖ్యలు.. కుక్క అని మండిపడ్డ వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి