KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ రూ.కోటి పరువు నష్టం దావా... మధ్యంతర ఉత్తర్వులు జారీ... రేవంత్ రెడ్డికి నోటీసులు
రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై కోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డికి నోటీసులు జారీచేసింది.
తెలంగాణ పీసీసీ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావాపై మంగళవారం సిటీ సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. పరువు నష్టం దావాలో ఇంజక్షన్ ఆర్డర్‌పై వాదనలు ముగిశాయి. డ్రగ్స్ కేసులో రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. తప్పుడు ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మంత్రి కోరారు. రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ రూ.కోటి దావా వేశారు. ఈ కేసులో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని రేవంత్ కు కోర్టు సూచించింది. పరువునష్టం దావాపై విచారణ అక్టోబరు 20కి వాయిదా వేసింది.
Also Read: White Challenge : డ్రగ్స్ కేసుల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు ! వైట్ చాలెంజ్‌లో గెలుపెవరిది?
కేటీఆర్ వర్సెస్ రేవంత్
తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ట్విట్టర్లో ఒకరికొకరు కౌంటర్ ఇచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి డ్రగ్స్ పరీక్షలపై కేటీఆర్ వైట్ ఛాలెంజ్ విసిరారు. దీంతో వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ జరిగింది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. డ్రగ్స్ పరీక్షలపై రేవంత్‌రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై కేటీఆర్ స్పందించారు. తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమేనని కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధమా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ డ్రగ్స్ టెస్ట్ కు ఒప్పుకొంటే దిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలకు తాను సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. తనది చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన స్థాయి కాదన్నారు. పరీక్షల్లో క్లీన్‌చిట్ వస్తే రేవంత్ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో లై-డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని రేవంత్‌కు ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
వైజ్ ఛాలెంజ్ పై రాజకీయ రగడ కొనసాగుతోంది. మంగళవారం టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించారు. వీరిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో ఇరు వర్గాలు దాడిచేసుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రేవంత్ ఇంటికి చేరుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. టీఆర్ఎస్ నేతలు రేవంత్ పై విరుచుకుపడ్డారు. రాహుల్ ను డ్రగ్స్ టెస్టుకు ఒప్పించాలని సవాల్ చేశారు.