CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి భద్రతపై ఫోకస్ - ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం
Telangana News: సీఎం రేవంత్ రెడ్డి భద్రతకు సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన దగ్గర ఉన్న పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది మొత్తాన్ని మార్చాలని నిర్ణయించింది.

Intelligence Key Decision on CM Security Issue: సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) భద్రతకు సంబంధించి రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన దగ్గర ఉన్న పోలీస్ భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చాలని నిర్ణయించింది. సీఎంకు సంబంధించి ప్రతీ సమాచారం లీక్ అవుతుందనే సెక్యూరిటీని మార్చినట్లు చెబుతున్నారు. గతంలో కేసీఆర్ (KCR) వద్ద పని చేసిన కొందరు సిబ్బంది ఇప్పుడు రేవంత్ వద్ద ఉండగా.. వారిని మార్చాలని నిర్ణయించారు. మాజీ సీఎం దగ్గర పని చేసిన ఏ ఒక్క అధికారిని, సిబ్బందిని కూడా సీఎం వద్ద పెట్టొద్దని సీఎంవోను ఐబీ ఆదేశించింది. కాగా, సీఎం దావోస్ పర్యటన ముగిసిన అనంతరం భద్రతా సిబ్బంది మార్పు ప్రక్రియ జరిగింది. తన వ్యక్తిగత సమాచారం బయటకు తెలిసిందని సీఎం.. ఇంటెలిజెన్స్ అధికారులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని మార్చారు. అటు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక పలు విభాగాల అధిపతులను మారుస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కీలక నిఘా విభాగాధిపతిగా శివధర్ రెడ్డిని నియమించారు.





















