Relief For BL Santosh : బీఎల్ సంతోష్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట - సిట్ నోటీసులపై స్టే !
బీఎల్ సంతోష్‌కు సిట్ జారీ చేసిన నోటీసుపై హైకోర్టు స్టే విధించింది. ఫిర్యాదులో సంతోష్ పేరు లేకపోయినా ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేశారని సంతోష్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Relief For BL Santosh : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఊరట లభించింది. ఆయనకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను డిసెంబర్ ఐదో తేదీకి వాయిదా వేసింది. తనకు ఇచ్చిన నోటీసులపైస్టే విధించాలని బీఎల్ సంతోష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. బీఎల్ సంతోష్ తరపు న్యాయవాది హైకోర్టులో.. అసలు ఈ కేసులో ఫిర్యాదు దారు అయిన రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేదని.. అలాంటప్పుడు ఆయన పేరును నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని వాదించారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీఎల్ సంతోష్ పాత్రపై పూర్తి స్థాయి ఆధారాలున్నాయని సిట్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నోటీసులపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గురువారమే రెండోసారి సిట్ అధికారులు బీఎల్ సంతోష్ కి జారీ 41 ఏ సీఆర్‌సీపీ కింద నోటీసులు జారీ చేశారు. 28వ తేదీన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 41ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద బీఎల్ సంతోష్ పాటు తుషార్, జగ్గుస్వామిలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టైన నిందితులు బీఎల్ సంతోష్ తో మాట్లాడినట్టుగా సిట్ వాదిస్తుంది. ఈ కేసులో సంతోష్ ను విచారిస్తే కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని సిట్ చెబుతుంది. ఎమ్మెల్యేలతో నిందితులు మాట్లాడినట్టుగా బయటకు వచ్చినట్టుగా ఉన్న ఆడియోలు, వీడియోల్లో కూడా సంతోష్ పేరును కూడా ఉపయోగించారని సిట్ అధికారులు చెబుతున్నారు.
ఇంతకు ముందు బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కానీ అప్పుడు హైకోర్టు బీఎల్ సంతోష్ సిట్ ఎదుట హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. సంతోష్‌కు వాట్సాప్ లేదా ఈ మెయిల్ ద్వారా నోటీసులు ఇవ్వాలని సూచించింది. అయితే సంతోష్ స్వయంగా దాఖలు చేసుకున్న పిటిషన్‌లో మాత్రం అనుకూల ఫలితం పొందారు. దీంతో సంతోష్ సిట్ ముందు హాజరు కావాల్సిన పరిస్థితి ఉండదు. తదుపరి విచారణ వచ్చే నెల ఐదో తేదీన జరుగుతుంది.
బీఎల్ సంతోష్‌తో పాటు నోటీసులు అందుకున్న జగ్గూ స్వామి, తుషార్ వంటి వారు స్పందించలేదు. కనీసం నోటీసులు అందుకున్నట్లుగా కూడా స్పష్టత లేదు. వారిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరో వైపు జగ్గూస్వామి సన్నిహితులు ఐదుగురికి సీఆర్పీసీ 41కింద నోటీసులు జారీ చేాశారు. బీఎల్ సంతోష్‌కు ఊరట లభించడంతో వారు కూడా.. తమకు ఇచ్చిన నోటీసుపై న్యాయపోరాటం చేసే అవకాశం ఉంది. వైెస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయన తాను సిట్ ఎదుట హాజరవుతానని ప్రకటించారు.