Telangana Latest News: పంచాయతీ ఎన్నికలపై రాజ్యాంగం ఏం చెబుతుంది?తెలంగాణ ప్రక్రియ ఎందుకు ఆలస్యమైంది?
Telangana News: రాజ్యాంగంలోని 73వ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా కొత్త పాలక వర్గం ఏర్పాటు చేయాలి.

Telangana Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలు 30 సెప్టెంబర్ 2025లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఈ తీర్పును ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది, రాజ్యాంగం స్థానిక సంస్థల ఎన్నికలపై ఏం చెబుతుందో సమగ్రంగా పరిశీలిద్దాం.
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విధి (Constitutional Mandate)
రాజ్యాంగంలోని 73వ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. దీని ప్రకారం, గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా కొత్త పాలక వర్గం ఏర్పాటు చేసేందుకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగ విధి. తెలంగాణలో 12,991 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పంచాయతీల పాలకవర్గం గడువు 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పంచాయతీలు ఉన్నాయి. ఆరు నెలల గడువులోగా ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే హైకోర్టు ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది.
స్థానిక ప్రభుత్వాలలో ప్రజల ప్రాతినిధ్యం లేకపోవడం
ప్రస్తుతం పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నడుస్తున్నాయి. కానీ రాజ్యాంగం ప్రకారం పంచాయతీల పాలన ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గం ద్వారా నడవాల్సి ఉంది. ప్రత్యేక అధికారుల పాలన తాత్కాలిక ఏర్పాటు తప్ప ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థ కాదని కోర్టు అభిప్రాయం. స్థానికంగా ప్రజల భాగస్వామ్యంతోనే పాలన జరగాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. వారి భాగస్వామ్యం లేకపోవడం అంటే ప్రజల గొంతుకను అణిచివేయడమని హైకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల జాప్యానికి సంబంధించి ఎన్నికల సంఘం కోర్టు ముందు ఉంచిన కారణాలను సాకులుగా భావించి న్యాయస్థానం తిరస్కరించింది.
ఎన్నికల నిర్వహణలో జాప్యానికి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పిన కారణాలివే:
1. గ్రామ పంచాయతీల పునర్విభజన, కొన్ని గ్రామ పంచాయతీలు సరిహద్దుల పునర్విభజన పెండింగ్‌లో ఉన్నాయి.
2. ఓటర్ల జాబితాలో సవరణలు పూర్తిగా జరగలేదని, మార్పులు-చేర్పులు, తొలగింపు వంటి ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.
3. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన ప్రక్రియ ఖరారు కాలేదు.
4. వర్షాకాలంలో ఎన్నికల నిర్వహణ కష్టమైన పని.
ఈ కారణాలను హైకోర్టు తప్పుబట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సాకులు చెబుతున్నారని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ ప్రక్రియను ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే పూర్తి చేసి ఉండాలని అభిప్రాయపడింది. వర్షాకాలంలో అవసరమైన చర్యలు చేపట్టి ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. అందులో రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన తన విధులు నిర్వర్తించడంలో విఫలమైందని, ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకుంటుందని పేర్కొనడం జరిగింది. ఈ పిటిషన్లను కొందరు మాజీ సర్పంచ్‌లు, సామాజిక కార్యకర్తలు, రాజకీయనేతలు వేయడం జరిగింది. దీనిపై స్పందించిన హైకోర్టు విచారణను చేపట్టింది. ఎన్నికల సంఘం చూపించిన కారణాలను తప్పుబట్టిన హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలోనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను జారీ చేయాల్సి ఉంటుంది.






















