Dalitha Bandhu: దళిత బంధు అమలుపై ముగిసిన వాదనలు.... తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
హుజూరాబాద్ లో దళిత బంధు అమలుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
దళిత బంధు అమలుపై తెలంగాణ హైకోర్టులో దాఖలపై పిటిషన్లపై వాదనలు ముగిశాయి. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హుజూరాబాద్ ఉపఎన్నిక కారణంగా ఆ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అమలు చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణలో దళిత బంధు పథకం అమలుచేశారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఒక్క హుజూరాబాద్ లోనే దళిత బంధు పథకం అమలు కావడం లేదన్నారు. అన్ని జిల్లాల్లో అమలవుతుందని కోర్టుకు తెలిపారు.
తీర్పు రిజర్వ్
కేంద్ర ప్రభుత్వం మహిళా పోషణ్ అభియాన్ అమలుకు అంగీకరించిన విధంగానే దళిత బంధు పథకాన్ని కూడా కొనసాగించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. దళిత బంధు పథకాన్ని ఆపడంతో వెనుకబడిన వర్గాల వారికి నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు పథకాన్ని ఎన్నికల సంఘం ఆపడం సరైన నిర్ణయం కాదన్నారు. వెంటనే దళిత బంధు పథకాన్ని అమలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.
ఈసీ నిర్ణయంపై మాటల యుద్ధం
హుజూరాబాద్ ఉప ఎన్నికల కారణంగా దళితబంధు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఆదేశాలు జారీచేసింది. దీంతో దళితబంధు అమలుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఉపఎన్నిక దృష్ట్యా దళిత బంధు పథకాన్ని ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఉపఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో వెంటనే దళిత బంధును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమలులో ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిథిగా కొనసాగించవచ్చని సూచించింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతల లేఖల కారణంగానే దళిత బంధు నిలిచిపోయిందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్ నేతలే లేఖలు రాసి ఎన్నికల డ్రామా ఆడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
Also Read: డబ్బులు ఇచ్చేదాకా కొట్లాడతా.. కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి