Dsp Transfer: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు - ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana News: ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం అధికారుల బదిలీల ప్రక్రియ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ ఇతర శాఖల్లో కీలక అధికారులను బదిలీ చేయగా తాజాగా భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది.
![Dsp Transfer: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు - ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం telangana government transfers 62 dsps in police department Dsp Transfer: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు - ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/18/68ac12f0a77b945c40cb3537cf9687971708237038926876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Government Transfers 62 Dsps: ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ సహా పలు శాఖల్లో అధికారుల బదిలీలు చేపట్టగా.. తాజాగా పోలీసు శాఖలో ఆదివారం 62 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో డీజీ కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న డీఎస్పీలందరికీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. తాజా బదిలీలతో రాష్ట్రంలో ఇప్పటివరకూ 300 మంది డీఎస్పీలు ట్రాన్స్ ఫర్ అయ్యారు. డీఎస్పీలతో పాటుగా హైదరాబాద్ లో పలువురు ఏసీపీలను సైతం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు.
భారీగా ఎంపీడీవోల బదిలీ
ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇటీవలే పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని 395 మంది ఎంపీడీవోలకు ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. సొంత జిల్లాలో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకు పైగా ఒకే చోట పని చేస్తున్న వారిని బదిలీ చేయాలని డిసెంబర్ లో ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగ్గా రెవెన్యూ శాఖలో తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లను సైతం బదిలీ చేసింది. తాజాగా, రెవెన్యూ శాఖలో 132 మంది తహసీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్లకు సర్కారు స్థానచలనం కలిగించింది. వీరిలో 11 మందికి పోస్టింగ్ ఇవ్వకుండా సర్కారు పెండింగ్ లో ఉంచింది. అయితే, కొంతకాలంగా వెయిటింగ్ లో ఉన్న 13 మందికి కొత్తగా పోస్టింగ్ ఇచ్చింది. మల్టి జోన్ - 1లో 69 మంది తహసీల్దార్లను బదిలీ చేసింది. ఈ ఏడాది జూన్ 30 తర్వాత రిటైర్ కాబోతున్న మరో 15 మంది తహసీల్దార్లకు సూపరింటెండెంట్/డీఏవోలుగా పదోన్నతి కల్పిస్తూ ట్రాన్స్ ఫర్ చేసింది. మల్టి జోన్ - 2 లో మొత్తం 43 మంది ఎమ్మార్వోలకు స్థానచలనం కల్పించింది. త్వరలో రిటైర్ కాబోతున్న మరో ఐదుగురికి పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చింది.
వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ
మరోవైపు, రాష్ట్రంలో గ్రామస్థాయిలో రెవెన్యూ విభాగాన్ని పటిష్టం చేసేందుకు గ్రామ రెవెన్యూ సహాయకుల (VRA) వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. చట్ట పరిమితులు, న్యాయ వివాదాలు, ఇతర విభాగాల్లో చేరిన వీఆర్ఏల సర్వీసుల పునరుద్ధరణ, ఇతర సమస్యలపై అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని శనివారం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను కమిటీలో సభ్యులుగా నియమించారు. వీఆర్ఏలకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి, వీలైనంత త్వరగా సిఫార్సులు ఇవ్వాలని అన్నారు. వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ, చట్ట పరిమితి, ఇతర విభాగాల్లో సర్వీసుల పునరుద్ధరణ, న్యాయ వివాదాలు, ఇతర అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)