Medaram Jatara 2024: మేడారం జాతరపై మంత్రి సీతక్క స్పెషల్ ఫోకస్- మెడికల్ క్యాంపులు, భక్తులకు సౌకర్యాలపై సమీక్ష
Sammakka Sarakka Jatara 2024: మేడారంలో భక్తుల వైద్య సేవలు అందించడంతోపాటు జాతర్లకు తరలివచ్చే భక్తులు ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
Minister Seethakka reviews arrangements of Sammakka Sarakka Jatara: తాడ్వాయి: మేడారం జాతరలో భక్తులకు విస్తృత వైద్య సేవలు అందించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కోటి మందికిపైగా తరలివచ్చే మేడారం (Medaram Jatara 2024)లో భక్తుల వైద్య సేవలు అందించడంతోపాటు జాతర్లకు తరలివచ్చే భక్తులు ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టే అంశాలపై మంత్రి సీతక్క మేడారంలోని హరిత హోటల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిస్టియన్ హెల్త్ డైరెక్టర్ కర్ణన్, ఐటీడీఏ పీవో, జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు.
భక్తులకు నిరంతర వైద్య సేవలు
సమ్మక్క సారక్క జాతర (Sammakka Sarakka Jatara)లో భక్తులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీతక్క సూచించారు. వైద్యులు దేవుడితో సమానమని అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారని.. జాతరలో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని సీతక్క అన్నారు. హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ క్రిస్టినా మాట్లాడుతూ.. జాతరలో ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ కాకుండా చూడాలని ఫుడ్ సేఫ్టీ అధికారుల పాత్ర కీలకమని ఆమె అన్నారు. జాతరలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులు భక్తులకు తెలిసే విధంగా సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. గద్దెల ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం లో 24/7 వైద్య సేవలు అందించాలని మెడిసిన్ కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని క్రిస్టినా అన్నారు.
హెల్త్ డైరెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ.. 40 జి వి కే బైక్ అంబులెన్సు సేవలు భక్తులకు నిరంతరం అందుబాటులో ఉంటాయని తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నిరంతరం వైద్య సిబ్బంది ఉండే విధంగా చూసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ముఖ్యంగా జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు ఉండేలా చూడాలనన్నారు. ఎండలు తీవ్రంగా ఉంటున్నాయని, జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణన్ అన్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు. ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం వెళ్లలేని భక్తులకు ఇంటి వద్దకే అమ్మవారి ప్రసాదం పంపించే సర్వీసును సైతం ప్రకటించారు. వాటితో పాటు ఇంటి నుంచే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునే సౌకర్యాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ ఆర్టీసీ సహకారంతో తీసుకొచ్చింది. తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం వెళ్లి అమ్మవార్లను దర్శించుకుంటారు.
పది రోజుల కిందటే తొలి ఘట్టం
మేడారం జాతరలో తొలి ఘట్టం మొదలయింది. గుడి మెలిగే పండుగతో ఆదివాసీల్లో సంబరాలు మొదలవుతాయి. ములుగు జిల్లాలోని మేడారం మహా జాతరలో భాగంగా గుడి మెలిగే పండుగ ను ఆదివాసీ పూజారులు ఘనంగా నిర్వహించారు. మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయాలను, పూజా సామాగ్రిని శుద్ధి చేసి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంతో మేడారం మహాజాతర తొలి ఘట్టం ప్రారంభమైంది.