KTR: తెలంగాణలో కొత్త పథకం రెడీ, ఆగస్టు 7 నుంచే స్టార్ట్ - అలా జరిగితే అకౌంట్లోకి రూ.5 లక్షలు
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7 నుంచి నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ బీమా కోసం అవసరమైన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించనుంది.
తెలంగాణలో మరో వర్గాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రారంభించనుంది. చేనేత, మరమగ్గాల కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు, రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని అమలుచేయబోతున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7 నుంచి నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ బీమా కోసం అవసరమైన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించనుంది. బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత కార్మికులు ఎవరైనా చనిపోయిన పక్షంలో వారి కుటుంబం లేదా నామినీకి రూ.5 లక్షలు అందచేస్తారు. చనిపోయిన పది రోజుల్లో ఈ మొత్తం సొమ్ము అబ్ధిదారుల అకౌంట్ లో జమకానుంది.
ఈ పథకానికి సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్ తెలిపారు. పథకం అమలుకు చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉండనుంది. నేతన్న బీమా కోసం ఎల్ఐసీ తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏడాదికి ఒకసారి కట్టే ప్రీమియం కోసం లబ్ధిదారులు లేదా కార్మికులు పైసా కూడా చెల్లించాల్సిన పన్లేదు. రాష్ట్ర ప్రభుత్వమే నేతన్నల ప్రీమియాన్ని చెల్లిస్తుంది. దీనికోసం రూ.50 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని మంత్రి కేటీఆర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
అర్హులు వీరే
60 ఏళ్లలోపు వయస్సున్న చేనేత, మరమగ్గాల కార్మికులు ఈ నేతన్న బీమా పథకానికి అర్హులుగా ఉంటారు. సుమారు 80 వేల చేనేత, మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా ద్వారా లబ్ధి చేకూరనుంది. అర్హులైన చేనేత, పవర్‌లూమ్ కార్మికులకి నేతన్న బీమా పథకాన్ని అమలుచేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
‘‘చేనేత కార్మికులు నిత్యం మగ్గం గుంతలో కూర్చొని కంటికి కనిపించని పోగులతో పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే, బరువైన యంత్రాలను తొక్కాల్సి వస్తోంది. ఈ క్రమంలో 40 ఏళ్లకే చాలా మంది అనారోగ్యాల బారిన పడుతుండటంతో వారి జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా, సహజంగా మరణించినా, ఏదైనా ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం కలిగినా రూ.5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. వారి కుటుంబాలకు భరోసాకు నిలుస్తుంది.' అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
చేనేత, జౌళి రంగానికి 2016-2017 నుంచి ప్రతి సంవత్సరం రూ.1200 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటనలో వివరించారు. చేనేత, జౌళి శాఖ రెగ్యులర్ బడ్జెట్‌కు ఈ బీమా సొమ్ము ఎక్స్‌ట్రా అని మంత్రి వెల్లడించారు.