Sammakka Saralamma Utsav: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు నిధులు విడుదల... రూ. 75 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకూ జరిగి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ జాతరకు ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది.
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2022 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసింది. నిధులు విడుదల చేసినందుకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో అతిపెద్ద గిరిజన, ఆదివాసీ జాతర గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత వైభవంగా జరుగుతోందన్నారు. కరోనా కష్టకాలంలో బడ్జెట్ సమస్యలు ఉన్నప్పటికీ సమ్మక్క-సారలమ్మ జాతరకు జీవో నెంబర్ 195 ద్వారా రూ.75 కోట్లు విడుదల చేయడం గిరిజన, ఆదివాసీలు, వారి ఆచారాలు, పండగలు, జాతరల పట్ల సీఎం కేసిఆర్ కు ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు.
Also Read: గంటసేపు కేసీఆర్ అబద్ధాలు.. అవన్నీ నిజమని తేల్చు, నేనే ముక్కు నేలకు రాస్తా: బండి సంజయ్
వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అన్ని వర్గాల పండగలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అన్ని కులాలు, మతాల వారికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించి, వారి పండగలను అధికారికంగా నిర్వహిస్తూ అన్ని వర్గాలను గౌరవిస్తున్న ప్రభుత్వమన్నారు. గత ఏడాది కూడా రూ.75 కోట్లు, అంతకుముందు వంద కోట్ల రూపాయలను సమ్మక్క – సారలమ్మ జాతరకు కేటాయించి, అక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించడం కోసం ఏర్పాట్లు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇప్పటికే అనేక శాశ్వత నిర్మాణాలు, తాత్కాలిక నిర్మాణాలతో మేడారంలో భక్తుల కోసం ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే జాతర కోసం వారం రోజుల కిందే 2.24 కోట్ల రూపాయలతో దుస్తులు మార్చుకునే గదులు, ఓ.హెచ్.ఆర్.ఎస్, కమ్యునిటీ డైనింగ్ హాల్ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. మిగిలిన వసతులన్నీ కూడా డిసెంబర్ లోపు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు.
Also Read: అది ఫామ్ హౌస్ కాదు.. ఫార్మర్ హౌస్.. సీదా ఒక్కటే అడుగుతానా వడ్లు కొంటరా? కొనరా?
భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు
ఈ జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో అన్ని ప్రత్యామ్నాయ వసతులు కల్పిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కా ప్రణాళికలతో అధికారులు పనులు చేస్తున్నారన్నారు. అత్యంత చారిత్రక ప్రాశస్త్యం ఉన్న అతిపెద్ద ఆదివాసీ జాతరకు సీఎం రూ.75 కోట్లు విడుదల చేయడం పట్ల మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: యునెస్కో క్రియేటివ్ సిటీస్ జాబితాలో శ్రీనగర్.. క్రాఫ్ట్స్, జానపద కళల కేటగిరీలో స్థానం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి