TSPSC: టీఎస్‌పీఎస్సీకి త్వరలో అయిదుగురు కొత్త సభ్యులు, కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు ప్రభుత్వ నిర్ణయం
Telangana Jobs 2024: తెలంగాణలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించి TSPSC వ్యవహారంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించి.. కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు కమిషన్‌లో కొత్తగా 5 సభ్యులను ప్రభుత్వం నియమించనుంది.
TSPSC New Members: తెలంగాణలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ (TSPSC) వ్యవహారంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించి.. కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు కమిషన్‌లో కొత్తగా అయిదుగురు సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. కమిషన్‌లో ఛైర్మన్ (TSPSC Chairman), మరో 10 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, అయిదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో ఛైర్మన్, ముగ్గురు సభ్యులు గవర్నర్‌కు రాజీనామా సమర్పించినా ఇంకా ఆమోదం లభించలేదు. వీటిపై న్యాయసలహా తీసుకుంటున్నారు.
ఒకవేళ ఆ ప్రక్రియ ఆలస్యమైనా ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసుకునేందుకు కొత్తగా అయిదుగురిని సభ్యులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలిస్తోంది. పరీక్షలు పూర్తయినా ఫలితాలు ప్రకటించాల్సినవి ఎన్నో ఉన్నాయి. సభ్యులు వస్తే వాటిని వెల్లడించవచ్చని భావిస్తున్నారు. కొత్తగా నియమించే సభ్యుల్లో ఒకరికి తాత్కాలిక ఛైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారా? అన్న చర్చ సాగుతోంది.
యూపీఎస్సీ తరహాలో మార్పులకు శ్రీకారం..
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ)ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తరహాలో పటిష్ఠమైన వ్యవస్థగా మార్చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోని సాయం కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జనవరి 5న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతో కలిసి ఇక్కడి యూపీఎస్సీ భవన్‌లో ఛైర్మన్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్‌కుమార్‌లతో భేటీ అయ్యారు. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో యూపీఎస్సీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసి నిర్దిష్ట కాలపరిమితిలోగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తిచేయడం అభినందనీయమని ప్రశంసించారు.
యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను తీర్చిదిద్దే అంశంపై గంటన్నరపాటు చర్చించారు. అవినీతి మరక అంటకుండా నియామకాలు పూర్తిచేయడానికి యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నియామక ప్రక్రియలో నూతన విధానాలు పాటించాలనుకుంటున్నామని, అందుకు తగిన మార్గనిర్దేశం చేయాలని యూపీఎస్సీ ఛైర్మన్‌ను కోరారు. తాము ఈ ఏడాది డిసెంబరు నాటికి 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామని.. ఇందుకు తగ్గట్టు టీఎస్‌పీఎస్సీని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం కమిషన్‌ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చినట్లు తెలిపారు. ఫలితంగా నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, పేపర్ లీక్‌లు, ఫలితాల వెల్లడి ఒక ప్రహసనంగా మారినట్లు రేవంత్ వెల్లడించారు.
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని.. కానీ, గత ప్రభుత్వ అసమర్థతతో నియామకాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకున్నట్లు యూపీఎస్సీ ఛైర్మన్‌కు వివరించారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ ఛైర్మన్ సోని.. ముఖ్యమంత్రి ప్రయత్నాన్ని అభినందించడంతోపాటు యూపీఎస్సీ సభ్యుల నియామకంలో అనుసరిస్తున్న విధానాన్ని రేవంత్‌రెడ్డికి వివరించారు. సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండదని, సమర్థత ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపారు. అందుకు స్పందించిన ముఖ్యమంత్రి.. తాము కూడా రాజకీయ ప్రమేయం లేకుండా ఛైర్మన్, సభ్యుల నియామకం చేపట్టనున్నట్లు చెప్పారు. కమిషన్‌లో అవకతవకలకు తావులేకుండా శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను యూపీఎస్సీ ఛైర్మన్ స్వాగతించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌తోపాటు, సభ్యులకు తాము శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. సచివాలయ సిబ్బందికీ అవగాహన తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.