Kaleshwaram Report Issue: కాళేశ్వరం నివేదికపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం - అధ్యయనానికి ఓ కమిటీ - కేబినెట్‌లోనే అసలు నిర్ణయాలు !
Kaleshwaram Commission report: కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అధ్యనయనం చేయడానికి ఓ కమిటీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. నాలుగో తేదీన జరగనున్న కేబినెట్ సమావేశానికి నివేదిక సమర్పిస్తారు.

Kaleshwaram Politics: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల విషయంలో నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అధికారులు ఇచ్చారు. జస్టిస్ పీసీ ఘోష్.. తమ కమిషన్ గడువు చివరి రోజన.. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారి రాహుల్ బొజ్జాకు నివేదిక ఇచ్చారు. ఆయన చీఫ్ సెక్రటరీకి పంపించారు. చీఫ్ సెక్రటరీ సీఎం రేవంత్ రెడ్డికి ఈ నివేదికలోని అంశాలను వివరించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు. నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్ కు కమిటీ సమర్పించనుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్,నిర్మాణం, కాంట్రాక్టర్లు సహా అనేక అంశాల్లో భారీ అవకతవకల్ని కమిషన్ గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం ఈ రిపోర్ట్ 650 పేజీలకుపైగా ఉంది. కమిషన్ గుర్తించిన విషయాలు, అవకతవకలకు పాల్పడిన వైనం గురించి ఉన్న డీటైల్స్ మొత్తంతో నివేదికను ప్రస్తుతం నియమించిన కమిటీ సిద్ధం చేయనుంది. ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయి..ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ఆ నివేదిక ఆధారంగా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. క్రిమినల్ చర్యలు తీసుకునేదిశగా సిఫారసులు ఉంటాయని భావిస్తున్నారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కకు కేవలం విచారణకు పిలిచే అధికారం మాత్రమే ఉంటుంది. అవకతవకలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. అదే చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వ నిర్ణయం. కేసులు పెట్టి అరెస్టులు చేయాలా..ఆ నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తు చేయించడానికి ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేయాలా అన్నది డిసైడ్ చేస్తారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారుల్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద వందల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యల విషయంలో బీఆర్ఎస్ నేతలు కూడా అప్రమత్తమయ్యారు. కేసీఆర్ రెండు రోజులుగా ఫామ్ హౌస్ లో కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను అడ్డం పెట్టుకుని తమపై కేసులు పెట్టే ఆలోచన చేస్తే ఏం చేయాలన్నదానిపై కార్యాచరణ ఖరారు చేసుకుంటున్నారు. కాళేశ్వరంలో ప్రధానంగా కేసీఆర్ పైనే సీఎం రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు. బనకచర్ల ఇష్యూని తప్పుదోవ పట్టించడానికి.. కాళేశ్వరంను తెరపైకి తెచ్చి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని,బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వ వైఫల్యాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపించే అవకాశం ఉంది.





















