Prisoners in Telangana: 213 మంది ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం క్షమాభిక్ష, బుధవారం విడుదలకు జీవో
Telangana News | ప్రజా పాలనలో దరఖాస్తులు పరిశీలించి అర్హులైన ఖైదీల వివరాలను ప్రభుత్వం గవర్నర్ ముందు ప్రవేశపెట్టగా ఆయన ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందుకు జీవో విడుదల చేసింది.
Telangana Government grants amnesty for release of prisoners హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న తమ కుటుంబ సభ్యులను విడుదల చేయాలని ఖైదీల కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పాలనలో దరఖాస్తులు అందజేశారు. వారి అభ్యర్థనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరించి ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ఖైదీల కుటుంబం చేసుకున్న ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు, అర్హులైన ఖైదీల వివరాలను హైలెవల్ కమిటీకి సమర్పించారు. హై లెవల్ కమిటీ విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాను క్యాబినెట్ ముందు ఉంచింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం ఆ ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకుని ఆమోదముద్ర వేసింది. విడుదలకు నిర్ణయించిన ఖైదీల జాబితాకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోద ముద్ర వేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం నాడు గవర్నర్ ను కలిసి ఈ విషయంపై చర్చించి, ఖైదీల జాబితా అందజేశారు.
గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం (జులై 2న) ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం 213 మంది ఖైదీలు చర్లపల్లి జైలు నుంచి బుధవారం జులై 3న విడుదల కానున్నారు. విడుదల కానున్న ఖైదీలలో 205 మంది యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న వారు, 8 మంది తక్కువ కాలం శిక్షపడిన వారు ఉన్నారు. ఖైదీలకు జైలులో వివిధ వృత్తులకు సంబంధించిన నైపుణ్యం తెచ్చుకునేందుకు శిక్షణలు ఇచ్చారు. మంచి ప్రవర్తన ద్వారా సమాజంలో తిరిగి అందరికీ కలిసిపోవడానికి వారందరికీ కౌన్సెలింగ్ ఇప్పించారు.