Ration Cards: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - కొత్త రేషన్ కార్డులపై కీలక అప్ డేట్
Telangana News: రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు, సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీని కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
Telangana Government Allowed Changings In Ration Cards: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులకు (Ration Cards) సంబంధించి మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది. శనివారం నుంచి ఎడిట్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసింది. మరోవైపు, ఎన్నికల కోడ్ ముగియడంతో కొత్త రేషన్ కార్డుల జారీపైనా కసరత్తు చేస్తోంది. త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు కావాలనుకునే వారు మీ సేవా కేంద్రాల్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేరు మార్పులతో పాటు ఇప్పటివరకూ అందులో పేర్లు లేని వారు సైతం ఎంట్రీ చేసుకోవచ్చు. మార్పులు, సవరణల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు సమర్పించాలి. వివరాల పరిశీలన అనంతరం రేషన్ కార్డుల్లో మార్పులు చేస్తారు.
కొత్త రేషన్ కార్డులపై కీలక అప్ డేట్
రాష్ట్రంలో ప్రతీ ప్రభుత్వ పథకం లబ్ధి పొందేందుకు రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుంటోన్న క్రమంలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి త్వరలోనే కార్డులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కసరత్తు చేయగా.. ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు కోడ్ ముగియడంతో కొత్త కార్డుల జారీకి సర్కారు సిద్ధమవుతోంది. పాత వాటి స్థానంలో కొత్త రూపంలో కార్డులు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులుండగా.. మరో 10 లక్షల కుటుంబాల నుంచి కొత్త వాటికి అప్లికేషన్స్ వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త కార్డుల మంజూరుపై కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
అప్పుడు అలా..
ఉమ్మడి రాష్ట్రంలో ఓ చిన్న పుస్తకం తరహాలో రేషన్ కార్డులు ఉండేవి. కుటుంబ యజమాని పేరుతో కార్డు జారీ చేయగా.. అందులో కుటుంబ సభ్యుల ఫోటో, పూర్తి వివరాలు ఉండేవి. ఆ తర్వాత వీటి స్థానంలో రైతు బంధు పాస్ బుక్ సైజులో రేషన్ కార్డులు అందించగా.. ఇందులో ముందువైపు కుటుంబ సభ్యుల ఫోటో, వివరాలు ఉండేవి. వెనుక వైపు అడ్రస్, ఇతర వివరాలు పొందుపరిచేవారు. ఆ తర్వాత ఆహార భద్రత కార్డులు జారీ చేశారు. సింగిల్ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫోటో లేకుండా.. కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్ షాప్ వివరాలు మాత్రమే కార్డులో ముద్రించేవారు. ఇప్పుడు తాజాగా, కొత్త తరహాలో రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు అనంతరం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీపై అప్ డేట్ ఇవ్వనుండగా.. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుల కోసం తెల్లకాగితంపై ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. కుటుంబ సభ్యుల వివరాలు సైతం పొందుపర్చేందుకు వారు కూడా అలానే అప్లికేషన్స్ సమర్పించారు. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకుంటే మీ సేవ పోర్టల్ ద్వారానే దరఖాస్తులు స్వీకరించే ఛాన్స్ ఉంది.
Also Read: Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి