Gruha Lakshmi scheme: వేగంగా గృహలక్ష్మి స్కీమ్ లబ్దిదారుల ఎంపిక-ఆరు రోజులే సమయం
గృహలక్ష్మి పథకం అమలులో వేగం పెంచింది తెలంగాణ సర్కార్. అక్టోబర్ 5 లోగా 3.5లక్షల మంది లబ్దిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో అధికారులు ఆ పనిలో తలమునకలై ఉన్నారు.
సొంత స్థలం ఉండి.. అందులో ఇళ్లు కట్టుకోవాలనుకే వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అర్హులకు రూ.3లక్షలు చొప్పున అందిచనుంది. ఒక్కో నియోజకవర్గానికి 3వేల ఇళ్ల చొప్పున.... రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీని కోసం లబ్దిదారుల ఎంపిక జరుగుతోంది. అయితే అక్టోబర్ 5 వరకు డెడ్‌లైన్ పెట్టింది ప్రభుత్వం. ఎందుకంటే... ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే... పథకం అమలు చేయాలని... 4లక్షల మంది లబ్దిదారులకు గృహలక్ష్మి పథకం వర్తింపచేయాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందుకే అక్టోబర్ 5లోగా లబ్దిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు సచివాలయం ఉంచి ఆదేశాలు వెళ్లాయి.
అయితే.. గృహలక్ష్మి స్కీమ్‌కు సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించారు. 15లక్షల మంది అప్లికేషన్లు కూడా పెట్టుకున్నారు. వాటిలో 3 లక్షల మందిఅనర్హులని తేల్చి పక్కనపడేశారు. మిగిలిన 11లక్షల దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలన ఉన్నాయి. వీటిలో నుంచి 4లక్షల మంది లబ్దిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 5వ తేదీ లోగా... అంటే ఆరు రోజుల్లోగా లబ్దిదారుల ఎంపిక చేయాల్సి ఉంది. అయితే... ఇప్పటికే లక్ష మందితో జాబితా సిద్ధమైనట్టు సమాచారం. మిగతా మూడు లక్షల మందికి ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం 4లక్షల మంది లబ్దిదారులను జాబితాను అక్టోబర్ 5వ తేదీ సాయంత్రానికి సిద్ధం చేయబోతున్నారు.
గృహలక్ష్మి పథకానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. దరఖాస్తుదారులు మహిళలు అయి ఉండాలి. వారి పేరు మీదనే పథకం మంజూరవుతుంది. స్థానికులై ఉండాలి. ఆధార్ లేదా ఓటరు ఐడీ, ఆహార భద్రత కార్డు, ఇంటి నిర్మాణానికి ఖాళీ స్థలం కలిగి ఉండాలి. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే అర్హులు. ఇప్పటికే RCC స్లాబ్‌తో ఇల్లు ఉన్నా... జీవో 59 కింద లబ్దిపొందినా గృహలక్ష్మీ పథకం వర్తించదు.
గృహలక్ష్మీ పథకంలో నిబంధనల ప్రకారం... నియోజకవర్గాల్లోని గ్రామాల వారీగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. ఇందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సహకరించాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. లబ్దిదారుల వివరాలతో అధికారులకు ఎమ్మెల్యేలు అందించే జాబితా ఆధారంగా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు చొరవ చూపిన ప్రాంతాల్లో నుంచి లిస్టు వేగంగా తయారవుతోంది. నిన్నటి లక్ష మందితో జాబితా సిద్ధం చేసింది. మిగిలిన 3లక్షల మంది ఎంపికలో తలమునకలై ఉన్నారు అధికారులు. ఇప్పుడు వచ్చిన దరఖాస్తులే కాకుండా.. ఇంకా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సమాచారం. గృహలక్ష్మీ పథకం కోసం దరఖాస్తు స్వీకరణ.. నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు అధికారులు. మొత్తంగా... ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా... గృహలక్ష్మి పథకం లబ్దిదారుల జాబితా రెడీ చేసి... అర్హులకు రూ.3లక్షల సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.