(Source: ECI/ABP News/ABP Majha)
Telangana: పునాదుల్లోంచి బయటపడిన లంకెబిందెలు… లైఫ్ సెట్టైందనుకున్నారు.. కానీ అంతలోనే…
కూలికెళితేకానీ పూటగడవని జీవితాలు వారివి. ఓ ఇంటిపనికెళ్లిన కూలీలు పునాదులు తవ్వుతుంటే లంకెబిందెలు బయటపడ్డాయి. కష్టాలు తీరాయనుకున్నారు…కానీ కొత్త కష్టాల్లో చిక్కుకుంటామని ఊహించలేకపోయారు..
జోగులాంబ గద్వాల జిల్లాలోని మనపాడుకి చెందిన జనార్దన్‌రెడ్డి.. ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ చేశాడు. పునాదులు తవ్వేందుకు తొమ్మిది మంది కూలీలను ఏర్పాటు చేశాడు. పునాదుల కోసం గుంతలు తవ్వుతుండహగా పెద్ద లంకె బిందెలు బయట పడ్డాయి. ఒక్కసారిగా కళ్లు మెరిసాయి. ఆనందంగా ఆ లంకెబిందెలు తెరిచి చూశారు. వాళ్ల ఆశని మెరిపిస్తూ ధగధగలాడే బంగారు నాణేలు కనిపించాయి. ఆ బిందెల్లో ఒకటి రెండు కాదు 98 బంగారు నాణేలున్నాయి. వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. లక్ష్మీదేవి కరుణించింది… కష్టాలు తీరిపోతాయనుకున్నారు. కూలికోసం వచ్చి జాక్ పాట్ కొట్టామని మురిసిపోయారు. గుట్టు చప్పుడుకాకుండా దొరికిన బంగారాన్ని తొమ్మది మందీ వాటాలు వేసుకున్నారు. ఎవరి వాటా వాళ్లు తీసుకెళ్లి కొందరు కాయిన్స్ అమ్మేసి సొమ్ము చేసుకుంటే... మరికొందరు వాటిని కరిగించి బంగారు ఆభరణాలు చేయించుకున్నారు. కానీ పోలీసులు వారికి ఆ ఆనందాన్ని ఉండనివ్వలేదు.
సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తొమ్మిది మంది కూలీలను అదుపులోకి తీసకుని విచారించారు. అప్పటికి కానీ తాము చేసిన తప్పేంటో వాళ్లకి అర్థంకాలేదు. పునాదులు తవ్వుతుండగా లంకెబిందెలు బయటపడ్డాయని... అందులో 98 బంగారు నాణేలు ఉన్నాయని కూలీలు విచారణలో అంగీకరించారు. బంగారు నాణేల విషయం ఇంటి యజమానికి చెప్పకుండా తామే పంచుకున్నామని కూడా ఒప్పుకున్నారు. ఒక్కో బంగారు నాణెం సుమారు 3 గ్రాముల ఉందన్నారు. బంగారు నాణేలను కొందరు ఆభరణాల రూపంలోకి మార్చుకోగా, మరి కొందరు అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్టు పోలీసులకు చెప్పారు. కూలీల దగ్గర నుంచి 12.12 తులాల బంగారు ఆభరణాలు, రూ.4.6లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆ తొమ్మిది మందిని అరెస్టు చేసి, ఇండియన్ ట్రెజరీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
నాలుగు నెలల క్రితం తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామలోనూ లంకె బిందెలు బయటపడటం సంచలనంగా మారింది. పెంబర్తి గ్రామం టంగుటూరు క్రాస్ వద్ద నర్సింహా అనే వ్యక్తి 11ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిని వెంచర్ గా మార్చేందుకు చదును చేసే పనులు చేస్తుండగా… ఆ స్థలంలో లంకె బిందె బయటపడింది. ఇందులో బంగారు, వెండి.. ఇతర ఆభరణాలు బయటపడ్డాయి. సుమారు 5కిలోల బంగారం లంకె బిందెలో ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని గ్రామస్థులు పోలీస్, రెవెన్యూ, పురావస్తుశాఖ అధికారులకు తెలియజేశారు. తెలంగాణలో గతంలోనూ నల్గొండ, వరంగల్, రంగారెడ్డి అక్కడక్కడా నిధులు బయటపడ్డాయి. 2019లో వికారాబాద్ జిల్లాలో గుప్త నిధులు బయటపడ్డాయి. జిల్లాలోని ఎర్రగడ్డపల్లికి చెందిన చెందిన రైతు యాకూబ్ అలీ పొలం దున్నుతున్న క్రమంలో కొన్ని పాత్రలు బయటపడ్డాయి. మరింత లోతుకి తవ్వగా ఆభరణాలుకూడా లభించాయన్నారు. అయితే అధికారికంగా కొన్ని రాగి పాత్రలు లభించినట్టు మాత్రమే తేలింది.