CM Revanth Reddy: ఒక్క మాటతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ భయాన్ని పోగొట్టారా? సినీ పరిశ్రమలో నూతనోత్సాహం
Telangana Gaddar Film Awards: తెలంగాణ ప్రభుత్వం గద్దర్ సినీ అవార్డులను ప్రదానం చేసింది. టాలీవుడ్ అభివృద్ధికి ఏం కావాలన్నా చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Telangana CM Revanth Reddy at Gaddar Film Awards: హైదరాబాద్: సినిమా రంగం (Tollywood) అభివృద్ధి సాధించడానికి పరిశ్రమకు ఏం కావాలో చెప్పాలని, ఏ హోదాలో ఉన్నా అండగా నిలబడుతా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సినీ పరిశ్రమకు అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. తెలంగాణకు ఎవరైనా రావొచ్చు. ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు. 500 ఫార్చూన్ కంపెనీల్లో 85 కంపెనీలు ఇక్కడ ఉన్నాయని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమపై తెలంగాణ ప్రభుత్వం గుర్రుగా ఉందని పుష్ప 2 తరువాత టాక్ నడిచింది. నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ సినీ అవార్డులు ప్రకటించడంతో ఇండస్ట్రీకి కొంత ఉపశమనం లభించింది. గత పదేళ్ల సినిమాలకు గద్దర్ సినీ అవార్డులు అందజేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో నెలకొన్న భయాలు, సందేహాలను పటాపంచలు చేశాయి. హైదరాబాద్ నగరాన్ని హాలీవుడ్, బాలీవుడ్ సినిమా పరిశ్రమకు అడ్డాగా మార్చడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న 2047 విజన్ డాక్యుమెంట్‌లో సినీ పరిశ్రమ రాణించడానికి నిర్దేశిత లక్ష్యాలతో ఒక చాప్టర్ ఉండాలన్నారు. అందుకు సినీ ప్రముఖులు అవసరమైన ప్రణాళికను తయారు చేయాలని సూచించారు.
హైదరాబాద్ హైటెక్స్‌లో “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024” ప్రదానోత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే సినిమా రంగం కూడా రాణించాలి. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, వచ్చే 10 ఏళ్ల నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మారాలంటే టాలీవుడ్ కూడా అభివృద్ధి సాధించాలి.
1964 నుంచి నంది అవార్డులు
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి 1964 లో నంది అవార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటి నుంచి 2014 వరకు ప్రతి ఏడాది అవార్డులు ఇచ్చారు. పలు కారణాలతో 14 ఏళ్ల కిందట ఆగిపోయిన సినిమా అవార్డుల ప్రదానోత్సవాన్ని పునరుద్దరించాలని ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ప్రతిపాదించారు. వాటిని పునరుద్దరించడంతో పాటు గడిచిన 10 ఏళ్లలో ప్రతిభ కనబరిచిన అందరినీ అభినందించాలని గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.
సినీ రంగాన్ని అభిమానిస్తాం..
కొన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కఠినంగా కనిపిస్తాయి. కానీ తెలంగాన ప్రభుత్వం సినిమా రంగాన్ని అభిమానంగా చూస్తుందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడే కాదు గతంలోనూ మా ప్రభుత్వాలు సినిమా రంగాన్ని గౌరవించాయి. గద్దర్ స్ఫూర్తిని మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. రాష్ట్ర అభివృద్ధిలో సినీ పరిశ్రమ భాగస్వామ్యం కావాలి. అందరం కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి. తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకునేందుకు సినీ పరిశ్రమ తోడుగా నిలవాలి. రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి” అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
2014 నుంచి 2024 వరకు ప్రతి ఏటా ఆయా కేటగిరీల్లో ఎంపికైనా ఉత్తమ చిత్రాలతో పాటు ప్రత్యేక అవార్డుల (#GaddarFilmAwards)ను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వహకులకు, అందుకు సహకరించిన సినీ రంగ ప్రముఖులకు అభినందనలు తెలిపారు






















