Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!
Major Events in the history of Telangana Movement: చివరగా 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ జూన్ 2తో 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ ఏటకు తెలంగాణ రాష్ట్రం అడుగుపెట్టనుంది.
Major Events in the history of Telangana Movement: 1969లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆగిపోయింది. ఆ తరువాత మలిదశ ఉద్యమానికి 1983లో హియాయత్ నగర్ ఎన్నికలు నాంది పలికాయి. ఆపై మలిదశ ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ స్థాపనతో 2001లో ప్రారంభమైనప్పటికీ.. 2009 తరువాతే ఉద్యమం ఎన్నో మలుపులు తిరిగింది. చారిత్రక ఘటనలు జరిగాయి. చివరగా 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ జూన్ 2తో 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ ఏటకు తెలంగాణ రాష్ట్రం అడుగుపెట్టనుంది. అయితే తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు ఇవే.
1. హైదరాబాద్ ఫ్రీ జోన్..!
అది 2009 అక్టోబర్.. పోలీసు ఉద్యోగాలకు హైదరాబాద్ లో లోకల్ రిజర్వేషన్లు ఎత్తివేసి..ఫ్రీ జోన్ గా ప్రకటించాలని ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పోలీస్ రిక్రూట్మెంట్ కోసం హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా సుప్రీంకోర్టు ప్రకటించింది. దీనివల్ల తెలంగాణ యువత రిజర్వేషన్లు కోల్పోతారని.. ఇది 610జీవోకు విరుద్ధమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. అలా.. మలిదశ ఉద్యమానికి నిప్పురవ్వ రాజేసింది ఈ ఫ్రీ జోన్ అంశమే.
2. తెలంగాణ వచ్చుడో - కేసీఆర్ సచ్చుడో..!
2009 నవంబర్ 29న తెలంగాణ వచ్చుడో - కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సిద్ధిపేటలో ఆమరణనిరహార దీక్ష ప్రారంభించారు. దీనిని అడ్డుకున్న సర్కార్.. కేసీఆర్ ను అదుపులోకి తీసుకుని ఖమ్మం జైలుకు పంపించారు. ఐతే.. ఖమ్మం జైలులోనూ మెతుకు ముట్టలేదు. దీంతో కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 4న ఉదయం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
3. భగ్గుమన్న విద్యార్థి లోకం.. శ్రీకాంతాచారి ఆత్మబలిదానం
కేసీఆర్ ఆమరణనిరాహార దీక్షతో స్పందించిన విద్యార్థి లోకం భగ్గుమంది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ఈ సమయంలోనే 29 నవంబర్ న ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ప్రాణాలతో పోరాడి డిసెంబర్ 3న శ్రీకాంతాచారి మృతి చెందడంతో ఉద్యమ ఆవేశాలు జనాల్లో పీక్స్ కు వెళ్లాయి. ఇక్కడి నుంచి తెలంగాణ ఉద్యమం వెనక్కి తిరిగి చూడలేదని చెప్పవచ్చు.
4. తెలంగాణకు అనూకులంగా చిదంబరం ప్రకటన
యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ వెంట నడవడంతో 2009 డిసెంబర్ 29 రాత్రి పదకొండున్నరకు ఓ ప్రకటన చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఇప్పుడే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం తెలిపారు. కేసీఆర్ వెంటనే ఆమరణనిరహార దీక్ష విరమించాలని కోరారు. ఈ ప్రకటనతో కేసీఆర్ దీక్ష విరమించగా.. యావత్ తెలంగాణ సమాజం సంబరాల్లో మునిగిపోయింది.
5. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం
తెలంగాణకు అనుకూలంగా చిదంబరం ప్రకటనతో సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సహా సీమాంధ్రకు చెందిన అందరు లీడర్ల సమైక్యాంధ్ర ఉద్యమం చేపట్టారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తెలంగాణ ఉద్యమానికి పోటీగా.. మరోసారి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని లెవనెత్తారు.
6. చిదంబరం ప్రకటన వెనక్కి..!
కేంద్రం తెలంగాణ అనుకూల నిర్ణయానికి.. సీమాంధ్ర నాయకుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో డిసెంబర్ 23న చిదంబరం మరో ప్రకటన చేశారు. రెండు ప్రాంతాల్లో ఉద్యమాలు ఎగిసిపడటంతో.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరమా అనే కోణంలో రాజకీయ పార్టీలు, ఇతర మేధావుల సూచనలు అన్ని పరిగణలోనికి తీసుకున్న తరువాత నిర్ణయం తీసుకుంటామని యూ టర్న్ తీసుకుని ప్రకటన చేశారు. దీంతో తెలంగాణ ఉద్యమం మళ్లీ మెుదటికి వచ్చింది.
7. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు..
చిదంబరం ప్రకటనతో తెలంగాణలోని ప్రజాప్రతినిధులంతా 48 గంటల్లోగా రాజీనామా చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా పొలిటకల్ జేఏసీకి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దానికి అధ్యక్షుడిగా ప్రొఫెసర్ కోదండరాంను ఎన్నుకున్నారు. ఇక్కడి నుంచే పార్టీ జెండాలు పక్కన పెట్టిన తెలంగాణ నాయకులు.. ప్రత్యేక రాష్ట్రమే ఏజెండాగా పెట్టుకుని ఉద్యమంలోకి దూకారు.
8. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు
2010 ఫిబ్రవరి 3న తెలంగాణ ఏర్పాటు సాధ్యసాధ్యాలపై 5 మందితో కూడిన రిటైర్డ్ జడ్జ్ జస్టిన్ శ్రీకృష్ణ నేతృత్వంలో 5 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. 9 నెలల పాటు ఉమ్మడి రాష్ట్రమంతా తిరిగి.. కవులు, కళాకారులు, రైతులు, వ్యాపారులు, విద్యార్థులు, రాజకీయనాయకులు ఇలా.. అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని అదే ఏడాది డిసెంబర్ 30 రిపోర్టు కేంద్రానికి అందజేసింది. ఈ కమిటీ 6 ఆప్షన్స్ ముందుపెట్టి.. మ్యాక్సిమమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే ఓటేసింది. దీంతో ఆంధ్రోళ్ల కుట్ర ఇది అంటూ తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఊరు వాడను ఏకం చేయాలని నిర్ణయించుకుంది
9. మిలియన్ మార్చ్.. సకల జనుల సమ్మె
2011 మార్చి 10.. ట్యాంక్ బండ్ పై పది లక్షల మందితో మిలియన్ మార్చ్ నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై ఆంధ్రకు చెందినవారి విగ్రహాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఉద్యమకారులు కొన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు. తెలంగాణ ఉద్యమంలోనే ఇదో చారిత్రక ఘట్టం. ఆ తరువాత 2011 సెప్టెంబర్13 న మెుదలై.. అక్టోబర్ 24 వరకు 42 రోజుల పాటు సకలజనుల సమ్మె నిర్వహించారు. ఈ 42 రోజులు తెలంగాణ రాష్ట్రం మెుత్తం స్థంభించిపోయింది.
10. యూపీఏలోని పార్టీలతో కాంగ్రెస్ చర్చలు
2013 జూలై 30న యూపీఏలోని అన్ని పార్టీలతో చర్చించి తెలంగాణకు అనుకులంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చాక తాము రాష్ట్ర ఏర్పాటు చేస్తామని బీజేపీ పెద్దలు సైతం ప్రకటనలు చేశారు.
11. తెలంగాణ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!
2013 అక్టోబర్ 3న 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజనకు సంబంధించిన బిల్ ను పార్లమెంట్ కు పంపడానికి సిద్ధం చేసింది.
12. తెలంగాణకు బిల్లుపై పార్లమెంట్ ఆమోదం..
2014 ఫిబ్రవరి 13న లోక్ సభలో ఏపీ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 18న లోక్ సభలో తెలంగాణ ఏర్పాటు బిల్లు పాస్ కాగా... ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఈ బిల్లు పాసైంది. 2014 మార్చి 1 రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగా.. కేంద్రం మార్చి 2న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్రం చేసిన ప్రకటనతో అధికారికంగా జూన్ 2 న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరి.. తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం సాధించుకున్నారు.