By: Y.sudhakar rao, | Updated at : 21 Nov 2023 07:35 AM (IST)
వామపక్ష పార్టీలకు ఏమైంది ? ఈసారైనా అసెంబ్లీలో కాలు పెడతారా ?
Telangana Polls 2023 : క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, ప్రజా పోరాటల్లో ఆరితేరిన యోధులు, మాటల తూటాలతో ప్రభుత్వాన్ని గద్దె దింపే వాక్చాతుర్యం గల గళాలు, సిద్దాంతం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమయ్యే నేతలు. ఇదంతా కమ్యూనిస్టు పార్టీల కోసం చెప్పే పరిచయ వాక్యాలు. అంతే కాదు.. ఒకప్పుడు ఎర్రజెండా అంటే ప్రజల్లో ఓ భరోసా.. తమ సమస్యలపై గళం విప్పుతారని.. వామపక్ష పార్టీలు (CPI and CPM Parties) అంటే సర్కారు వెన్నులో వణుకు. ప్రజల కోసం మిలిటెంట్ పోరాటానికైనా వెనుకాడరని... అధికారంలోకి రావాలంటే.. కమ్యూనిస్టులతో మిత్రుత్వం నెరపాల్సిందే అన్నది ఒకప్పటి ఎన్నికల స్ట్రాటజీ.. అలాంటి కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఎం ఎన్నికల రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్న దీన స్థితిలో ఉన్నాయి.
అసెంబ్లీలో రెండెంకల సీటు నుండి సున్నాకు పతనం..
తెలంగాణలో గడ్డపై కమ్యూనిస్టు పార్టీల (CPI CPM) ప్రాభవం ఒకప్పుడు అంతా ఇంతా కాదు. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుండి నిన్నటి తెలంగాణ ఉద్యమం వరకు ఎర్రజెండా పాత్ర మరువలేనిది. అలాంటిది ఇవాళ తమ ఉనికి కోసం కొట్లాడే పరిస్థితి నెలకొంది. ఎన్నికల రాజకీయాల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తే ఎక్కువ సీట్లు గెలుస్తామనుకునే పార్టీలు ఇవాళ కమ్యూనిస్టులకు ఏదో ఒకటి సీటు ఇస్తాం.. మాతో కలిస్తే కలవండి లేదంటే మీ ఇష్టం అన్న పరిస్థితికి ఎర్రజెండా పార్టీలు దిగజారాయి. తొలి సార్వత్రిక ఎన్నికలు దేశంలో 1952లో జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నిజాం ఏలుబడిలో హైదరాబాద్ రాష్ట్రంగా ఉంది. ఇక అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు. మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఆంధ్ర ప్రాంతం ఉంది. ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేసి 41 స్థానాల్లో గెలిచారు. తెలంగాణ లో చిన్న చిన్న పార్టీలన్నింటిని కలుపుకుని డెమెక్రటిక్ ఫ్రంట్ పేరుతో కమ్యూనిస్టు పార్టీ బరిలోకి దిగి 37 స్థానాల్లో గెలిచింది.
1962 లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయి సీపీఐ, సీపీఎం పార్టీలుగా రూపొందాయి. అప్పటి నుంచి ఆ రెండు పార్టీలు తమ ప్రాభవాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ప్రతీ ఎన్నికల్లో వారి ఓటింగ్ శాతం, సీట్లు తగ్గిపోయాయి. ఇక తెలంగాణ ఏర్పడే నాటి పరిస్థితులను గమనిస్తే.. 2014లో ఉమ్మడి రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన తర్వాత జరిగిన ఎన్నికలు ఇవి. ఇందులో అప్పటికే తెలంగాణ చాంపియన్ గా టీఆర్ఎస్, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ బరిలో ఉంటే, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, ఎంఐఎం లతో పాటు సీపీఐ, సీపీఎం పార్టీలు ప్రధాన పార్టీలుగా పోటీ పడ్డాయి. టీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం లు కేవలం చెరో స్థానాన్ని మాత్రమే గెల్చుకున్నాయి. ఎస్టీ నియోజకవర్గాలైన భద్రాచలం నుండి సీపీఎం తరపున సున్నం రాజయ్య, సీపీఐ పార్టీ తరపున పోటీ చేసి దేవరకొండ నియోజకవర్గం నుండి రవీంద్రనాయక్ మాత్రమే గెలిచారు. ఆ ఎన్నికల్లో సీపీఐ 38 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటు మాత్రమే గెల్చుకుంది.
ఇక సీపీఎం 68 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటులో మాత్రమే గెలిచింది. సీపీఐకి 2014లో 2.54,859 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే మొత్తం ఓట్లలో సీపీఐ సాధించిన ఓటింగ్ శాతం కేవలం 0.53 శాతం మాత్రమే. 2009 ఎన్నికలతో పోల్చితే సీపీఐ ఓటింగ్ 0.69 శాతం తగ్గింది. సీపీఎం విషయానికి వస్తే మొత్తం 4,07,376 ఓట్లను సాధించగా ఓటింగ్ శాతం 0.84 మాత్రమే. 2009 ఎన్నికలతో పోల్చితే సీపీఎం కూడా 0.59 శాతం ఓట్లను కోల్పోయింది. ఇక సీపీఐ, సీపీఎం పార్టీలతో పోల్చితే..తెలంగాణలోని ప్రాతినిధ్యం లేని బీఎస్పీ పార్టీ నుంచి ఇద్దరు, మరో ఇద్దరు ఇండిపెండెంట్లు గెలవడం విశేషం. ఈ విధంగా వామపక్ష పార్టీలు ఎన్నికల రాజకీయాల్లో మసకబారడం మొదలుపెట్టాయి.
2018 ఎన్నికల్లోను ఒక్క సీటు గెలవని వామపక్షాలు
ఇక 2014 తర్వాత వచ్చిన ముందస్తు ఎన్నికల్లో వామపక్ష పార్టీల పరిస్థితి మరీ ఘోరం. 2018 ఎన్నికలకు వస్తే ఆ ఎన్నికల్లోను రెండు ఎర్రజెండా పార్టీలు మరింత క్షీణ దశకు చెరుకున్నట్లు ఓటింగ్ శాతం చెబుతోంది. ఈ ఎన్నికల్లో సీపీఐ మూడు స్థానాల్లోనే పోటీకి దిగింది. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. సీపీఎం 26 స్థానాల్లో బరిలోకి దిగి ఒక్క సీటు గెలవలేదు. ఈ ఎన్నికల్లో సీపీఐ కేవలం 83,215 ఓట్లు మాత్రమే సాధిస్తే, సీపీఎం 91,099 ఓట్లు మాత్రమే సాధించింది. 2014 ఎన్నికల్లో సీపీఐ 0.53 శాతం ఓట్లు సాధించగలిగితే 2018 ఎన్నికల్లో 0.40 శాతం ఓట్లు మాత్రమే సాదించింది. 0.13 శాతం ఓట్లను కోల్పోయింది. ఇక సీపీఎం 2014 ఎన్నికల్లో 0.84 శాతం ఓట్లను సాధిస్తే, 2018 వచ్చే నాటికి ఆ పార్టీ సాధించిన ఓటింగ్ శాతం 0.44 శాతం మాత్రమే. సీపీఎం పార్టీ 0. 4శాతం ఓట్లను కోల్పోయింది.
2023 ఎన్నికల్లో ఖాతా తెరుస్తారా.. డకౌట్ అవుతారా..?
2023 ఎన్నికల్లో సీపీఐ ఒక్క స్థానంలోనే బరిలోకి దిగింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సీపీఐ పార్టీ, కొత్తగూడెం నియోజకవర్గం నుండి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును బరిలోకి దింపింది. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి బరిలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. అయితే సీపీఐ పార్టీ గెలుపు కూడా అంత సులువుగా లేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఓటింగ్ అంతా సీపీఐకి షేర్ అవుతందా లేదా అన్న ఆందోళన ఎర్రజెండా పార్టీ నేతల్లో నెలకొంది. మరో వైపు బరిలో దిగిన జలగం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఓట్లను చీల్చుతే అది సీపీఐ కి నష్టం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి సీపీఐ గెలుపు ఇక్కడ నల్లేరు మీద నడకలా మాత్రం లేదు.
ఇక సీపీఎం పార్టీ ఒంటరిగానే ఈ ఎన్నికల్లోనూ బరిలోకి దిగింది. మునుగోడులో చేసిన సాయానికి బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని భావించినా.. కాంగ్రెస్ తో కలిసి పోటీలో దిగుదామనుకున్నా... అదీ కుదరక చివరకు ఈఎన్నికల్లో ఒంటరిగానే బరిలో నిలిచింది. తెలంగాణలో 17 స్థానాల్లో సీపీఎం తన అభ్యర్థులను నిలబెట్టింది. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వయంగా ఎన్నికల బరిలో నిలిచారు. ఇక ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు ఎన్నికల్లో నిలబడటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో ఇద్దరు వామపక్ష పార్టీ సారథులు గెలిచి అసెంబ్లీలో కాలుపెడతారా.. లేక 2018 ఎన్నికల మాదిరి వామపక్ష పార్టీలు డకౌట్ అవుతాయా అన్నది చూడాలి.
రెపరెపలాడిన ఎర్రజెండా ఎందుకు తల దించింది..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా పోరాటాలు చేసిన ఘన చరిత్ర సీపీఐ, సీపీఎం పార్టీలది. రైతులు, కార్మికులు, వ్యసాయ కూలీలు, పేద ప్రజలకు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, కరెంటు చార్జీల పెంపు ప్రజా సమస్యలే ఏజెండాగా పని చేసేవి. ఆయా ప్రభుత్వాలు సైతం కమ్యూనిస్టు పోరాటాలకు భయపడి వారి ఎజెండా అమలుకు సిద్ధపడేవి. అలాంటి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఇవాళ శాసన సభలో ప్రాతినిధ్యం లేని పరిస్థితికి దారి తీసింది. భూపోరాటలతో రాష్ట్ర సర్కార్ ను ముప్పతిప్పలు పెట్టిన పార్టీలు ఇవాళ పార్టీకి ఊపిరిలూదేందుకు కష్టపడాల్సి వస్తోంది.
తెలంగాణ ఉద్యమం కారణంగా ఈ రెండు పార్టీలు తమ ఉనికిని కోల్పోయాన్నది కొందరి రాజకీయ విశ్లేషకుల వాదన. ప్రజా సమస్యల కన్నా పెద్ద డిమాండ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వామపక్ష పార్టీలకు తెలంగాణలోనే బలమెక్కువ. అయితే ఇక్కడి ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించడంలో రెండు పార్టీలు విఫలమవడమే ఇందుకు కారణమని చెబుతారు. ఆలస్యంగా అయినా సీపీఐ తెలంగాణకు మద్ధతు పలకగా, సీపీఎం పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంది. ఈ వైఖరి కారణంగా సీపీఎం తెలంగాణలో కొంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక సీపీఐ తెలంగాణకు మద్దతు ఇచ్చినా, అందుకు తగిన రీతిలో పోరాటరూపాలను ఎంచుకుని దూకుడుగా తెలంగాణ ప్రజల మనసు గెలిచేలా సరైన ప్రణాళికతో పని చేయకపోవడం వల్ల వెనుకపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ప్రజా సమస్యలను గుర్తించి, పోరాడే ప్రణాళిక సరిగా లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నది బహిరంగ రహస్యమే.
విలీనం సాధ్యమేనా..
రెండు తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ స్థితి నుండి గట్టెక్కాలంటే సీపీఐ, సీపీఎంలు విలీనం కావాలన్న డిమాండ్ రెండు పార్టీల్లో గట్టిగానే వినిపిస్తోంది. కాని వర్గ శత్రువు ఎవరు అన్న అంశంపై రెండుపార్టీల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ కారణంతో రెండు పార్టీల మధ్య వైరుధ్యం కొనసాగుతోంది. అయితే తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రజా సమస్యలే ఎజెండాగా పని చేస్తేనే ఈ రెండు పార్టీలకు రాజకీయాల్లో మనుగడ సాధ్యమని లేదంటే రోజు రోజుకు ఎర్రజెండా ప్రాభవం తగ్గిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు గెలవకపోతే ఈ రెండు పార్టీల్లోని కార్యకర్తల్లో నైరాశ్యం, ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం ఖాయమని విశ్లేషిస్తున్నారు.
Komatireddy Wishes Revanth: సీఎంగా రేవంత్రెడ్డి ఎంపిక, హర్షం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి, డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం- కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Trains Cancelled: మిగ్ జాం ఎఫెక్ట్ - ఈ రైళ్లు రద్దు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?
Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు
/body>