Telangana Elections 2023: 'కాంగ్రెస్ అలా చేస్తే ముక్కు నేలకు రాస్తా' - సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
CM KCR Comments: తెలంగాణలో గత పదేళ్లలో అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జనగామలోని చేర్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.
CM KCR Commnets in Cheryala Praja Ashirwada Sabha: ఎన్నికలు రాగానే ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటెయ్యాలని, రాష్ట్రం తలరాతను మార్చే శక్తి ఒక్క ఓటుకే ఉందని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాలలో (Cheryala) ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని గమనించాలని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాక ముందు సాగు నీటి, తాగునీటి, కరెంట్ కష్టాలుండేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపి 58 ఏళ్లు గోస పెట్టిందని, ఎంతో పోరాటంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. తాము ఓట్ల కోసం అబద్ధాలు చెప్పమని, 'కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.2 వేల పింఛన్ ఇస్తున్నారా.?' అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.2 వేలు పింఛన్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు ఆలోచించుకోవాలని, అభివృద్ధిలో ఇప్పుడు దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ కు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
'రేవంత్ రెడ్డి కాదు రైఫిల్ రెడ్డి'
రేవంత్ రెడ్డికి ఆయన పార్టీ నేతలే రైఫిల్ రెడ్డి అనే పేరు పెట్టారని, ఆయన రేవంత్ రెడ్డి కాదని, రైఫిల్ రెడ్డి అని సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి ఉద్యమకారులపై తుపాకులు ఎక్కుపెట్టి తిరిగారని, ఉమ్మడి ఏపీలో ఆంధ్రోళ్ల బూట్లు మోశారని మండిపడ్డారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. '50 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్లు ఎన్ని వాగ్ధానాలు చేసి విస్మరించారో మనం చూడలేదా.? రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తారు. రైతు బంధు తీసేస్తారు.' అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
'బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలి'
ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నిలిపామని, మరో పదేళ్లు పాలన ఇలాగే ఉంటే రైతులంతా బాగు పడతారని సీఎం కేసీఆర్ వివరించారు. సంపద పెరిగే కొద్ది సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతున్నామని అన్నారు. 'మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే పింఛన్లు క్రమంగా రూ.5 వేలకు పెంచుతాం. రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. నీటి తీరువా రద్దు చేశాం. 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. రైతు బంధు ఇస్తున్నాం. రూ.5 లక్షల రైతు బీమా ఇస్తున్నాం. రైతులు పండించిన పంట అంతా గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే రైతుల ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నాం.' అని కేసీఆర్ పేర్కొన్నారు.
'నన్ను చూస్తే వారికి భయం'
రాష్ట్రంలో రైతులకు 24 గటల కరెంట్ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ఇస్తామన్న 3 గంటల కరెంట్ కావాలో.? 24 గంటల ఉచిత కరెంట్ కావాలో.? ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని వెల్లడించారు. తనను చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయని, రాష్ట్రానికే పరిమితం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో తాను గెలిస్తే మహారాష్ట్రకు వెళ్తానని భయపడుతున్నారని, అందుకే బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా మార్చామని, పంజాబ్ ను తలదన్ని 3 కోట్ల ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ప్రజలు ఆలోచించి, వివేకంతో బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.