Telangana DGP: డిసెంబరు 31తో డీజీపీ పదవీకాలం ముగింపు, తెలంగాణకు కొత్త డీజీపీ ఎవరు?
సీనియారిటీ ప్రాతిపదికన ఐగుదుగురు ఉన్నతాధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. వారి లిస్టు ఇప్పటికే యూపీఎస్సీని చేరింది.
Telangana New DGP: తెలంగాణకు డీజీపీగా చాలా కాలం నుంచి ఉన్న మహేందర్ రెడ్డి పదవీ కాలం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 31తో మహేందర్ రెడ్డి (Telangana New DGP) పదవీ విరమణ చెందనున్నారు. అయితే, కొత్త డీజీపీ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. డీజీపీ రేసులో మొత్తం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండడం లాంటి కీలక పరిణామాలు ఉండడంతో ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనేది ప్రాధాన్యం సంతరించుకుంది.
డీజీపీ రేసులో ఐదుగురు ఉన్నతాధికారులు
సీనియారిటీ ప్రాతిపదికన ఐగుదుగురు ఉన్నతాధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. వారి లిస్టు ఇప్పటికే యూపీఎస్సీని చేరింది. వారిలో ముగ్గురి పేర్లను సిఫారసు చేస్తూ రాష్ట్రానికి యూపీఎస్సీ (UPSC) సూచన చేస్తుంది. అయితే డీజీపీ రేసులో 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత ఏసీబీ డీజీ (ACB DG) అంజనీ కుమార్ (Anjani Kumar) (గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పని చేశారు), 1989 బ్యాచ్‌కు చెందిన హోంశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ రవి గుప్తా రేసులో ఉన్నారు. వారితో పాటు మరో ముగ్గురు ఐపీఎస్‌లు కూడా పోటీ పడుతున్నారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) (ప్రస్తుత హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు), అడిషనల్ డీజీ జితేందర్, రాజీవ్ రతన్ కూడా రేసులో ఉన్నారు. ఈ ఐదుగురిలో డీజీపీ పోస్టు ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Mahendar Reddy: మహేందర్ రెడ్డికి మరో పోస్టు?
పదవి విరమణ చేయనున్న మహేందర్ రెడ్డి (Mahendar Reddy IPS) కోసం ప్రభుత్వం మరో పోస్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఇటీవల ప్రారంభించిన TSPICCC ఛైర్మన్ పోస్టును ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ హోదాలో నియమించనున్నట్లు సమాచారం. ఈ పదవి ఉన్నవారికి కేబినెట్ హోదా లభించనుంది. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడతాయని తెలుస్తోంది. ఈ పోస్టు కింద టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగాలు కూడా ఉంటాయని తెలిసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1986 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డి (Mahendar Reddy IPS). రాష్ట్ర విభజన తర్వాత ఆయన్ను తెలంగాణ కేడర్ కు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్, గుంటూరు, బెల్లంపల్లిల్లో అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ (ఏఎస్పీ) గా పనిచేశారు. ఆ తర్వాత నిజామాబాద్, కర్నూలు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. 1995లో హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా పని చేశారు. అనంతరం ఇంటెలిజెన్స్ చీఫ్, గ్రే హౌండ్స్ ఐజీగా పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా వ్యవహరించారు. 2017 నవంబర్‌లో ఇన్‌చార్జ్ డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత 2018 ఏప్రిల్‌లో పూర్తి స్థాయి డీజీపీగా నియమితులు అయ్యారు.