Bharat Jodo Yatra : తెలంగాణ సమాజం రాహుల్ గాంధీకి అండగా నిలబడింది - రేవంత్ రెడ్డి
Bharat Jodo Yatra : తెలంగాణలో మరో మూడు రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఈ నెల 7న జరిగే బహిరంగ సభ ఏర్పాట్లపై టీపీసీసీ సమీక్షించింది.
Bharat Jodo Yatra : నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరీ లో భారత్ జోడో యాత్రపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర నేతలు పాల్గొన్నారు. మరో మూడు రోజుల్లో తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగుస్తుండడటంతో కార్యాచరణపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. యాత్ర విజయవంతం చేయడంతో పాటు నవంబర్ 7న జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రాబోయే మూడు రోజులు అత్యంత కీలకం అన్నారు. మక్తల్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ సమాజం రాహుల్ గాంధీకి అండగా నిలబడిందన్నారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో జోడో యాత్ర తెలంగాణకు వచ్చిందన్నారు. అయినా యాత్రను విజయవంతం చేయడానికి నాయకులు ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ నెల 5, 6న మాత్రమే పాదయాత్ర కొనసాగుతుందని, 5వ తేదీ సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. 6వ తేదీన ఎలాంటి కార్నర్ మీటింగ్ ఉండదని, 7న వీడ్కోలు సమావేశం నిర్వహిస్తు్న్నట్లు స్పష్టం చేశారు. 7వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు.
అడుగడుగున నేల పై…
— Revanth Reddy (@revanth_anumula) November 3, 2022
నీరాజన సంద్రమై…
వస్తున్నాడదిగో మన రాహుల్ గాంధీ…
జై బోలో - భారత్ జోడో#ManaTelanganaManaRahul #BharatJodoYatra#Day9 pic.twitter.com/tuz5tXPBo2
ఈ నెల 7న భారీ బహిరంగ సభ
"ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నేతలకు పాదయాత్రలో పాల్గొనే అవకాశం రాలేదు. ఈ నెల 7వ తేదీ రాత్రి సమయంలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుంది. రాత్రి 9.30 కు దెగ్లూరులో మహారాష్ట్ర నేతలతో పరిచయం చేయబోతున్నాం. 4 pm నుంచి 6pm లోపే బహింరంగ సభను నిర్వహించుకోవాలి. నాలుగు పార్లమెంట్ నియోజక వర్గాల నాయకులు ఈ మూడు రోజులు క్రియాశీల పాత్ర పోషించాలి. రాహుల్ యాత్ర కవరేజీ కాకుండా కుట్రలు చేసినా మీడియా మంచి కవరేజ్ ఇచ్చింది. జర్నలిస్టులకు కూడా చాలా అన్యాయం జరిగింది. జర్నలిస్టు సంఘాల నాయకులకు కూడా రాహుల్ తో ప్రత్యేక సమయం కల్పిస్తాం. వారి సమస్యలను రాహుల్ కు విజ్ఞప్తి చేసుకోవచ్చు." -రేవంత్ రెడ్డి
సంగారెడ్డిలో
తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురువారం సంగారెడ్డి జిల్లాలో నిర్వహించారు. కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజల ప్రేమ, అభిమానం ఉన్నంత కాలం భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదన్నారు. దేశంలో బీజేపీ, ఆరెస్సెస్, హింసను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు. సామాన్యుల్లో భయాందోళన సృష్టిస్తున్నాయన్నారు. ఉద్దేశ పూర్వకంగానే బీజేపీ దేశంలో నిరుద్యోగం పెరిగేలా చేస్తోందన్నారు. నోట్ల రద్దుతో ఎవరికి లాభం జరిగిందని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో నిరుద్యోగం పెరిగిందని విమర్శించారు. మోదీ తప్పుడు నిర్ణయాలతోనే దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ధనం కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. బీజేపీ, టీఆరెస్ వేరు కాదు.. ఇద్దరూ కలిసే ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే బీజేపీ, టీఆరెస్ విధానం అన్నారు. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ విద్య, వైద్యాన్ని ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపించారు.