Telangana Congress Second list: 64 స్థానాల్లో అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు - దసరా తర్వాతే కాంగ్రెస్ రెండో జాబితా
Telangana Congress Second list: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా దసరా పండుగ తర్వాతే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులు రెండో జాబితా దసరా తర్వాతే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 55 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయగా, మిగిలిన 64 స్థానాలపై సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. శనివారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతను స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, ఇతర నేతలు, సభ్యులు దాదాపు 4 గంటలు సమావేశమయ్యారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో నాలుగైదు నియోజకవర్గాల్లోనే చిక్కుముడి పడినట్లు సమాచారం. ఈ స్థానాల్లో సీనియర్ నేతలు టికెట్ల కోసం గట్టిగా ఆశిస్తుండగా, ఇతర నేతలు కూడా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర స్క్రీనింగ్, సీఈసీ ఎటూ తేల్చుకోలేకపోయినట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆయన సమక్షంలోనే ఈ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.
లోతుగా విశ్లేషణ
తొలి జాబితాలో ప్రకటించిన 55 మందిలో పార్టీలోకి కొత్తగా వచ్చిన 12 మందికి టికెట్లు దక్కడం, సర్వేలో మెరుగైన ఫలితాలున్నా, ఇతరులకు టికెట్లు కేటాయించడం వంటి అంశాలను ఏఐసీసీ తీవ్రంగా పరగిణిస్తోంది. సామాజిక సమీకరణలు, తాజా రాజకీయ పరిణామాలు, ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలను పరిగణలోకి తీసుకుని, అధికార బీఆర్ఎస్ ను ఎదుర్కొనేలా అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ లోతుగా విశ్లేషిస్తోంది. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాలని భావిస్తోంది.
టికెట్ల కోసం పోటీ అధికం
వనపర్తి, సూర్యాపేట, సత్తుపల్లి తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థులకు టికెట్ల విషయంలో గట్టి పోటీ ఉంది. వనపర్తి టికెట్ ను పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డితో పాటు మరో ఇద్దరు ఆశిస్తున్నారు. అలాగే, నిజామాబాద్ అర్బన్ స్థానంలో మైనార్టీ వర్గానికే టికెట్ ఇవ్వాలని జాతీయ నాయకత్వం భావిస్తుండగా, అక్కడ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు మరికొందరు టికెట్ ఆశిస్తున్నారు. ఎల్బీ నగర్ టికెట్ ను మధుయాష్కీ ఆశిస్తుండగా, తమకే ఇవ్వాలని స్థానిక నేతలు ఒత్తిడి తెస్తున్నారు.
లోపాలు లేకుండా
కాంగ్రెస్ తొలి జాబితాలో 55 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, అత్యధికంగా 17 సీట్లు రెడ్డిలకు, బీసీలకు 12, ఎస్సీలకు 12, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 దక్కాయి. ఆరు సీట్లు మహిళలకు కేటాయించగా, ఆయా చోట్ల టికెట్లు ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు అసంతృప్తికి లోనయ్యారు. కొందరు ఏకంగా పార్టీనే వీడి వెళ్లారు. ఈ క్రమంలో ఓ కమిటీ ఏర్పాటు చేసిన హస్తం పార్టీ అసంతృప్తులను బుజ్జగించింది. తొలి జాబితా తర్వాత లోపాలు సరిదిద్దుకుంటూ ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా రెండో జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ నేతలకు బుజ్జగింపు బాధ్యత
మిర్యాలగూడతో పాటు భద్రాచలం, మధిర, పాలేరు, ఇబ్రహీంపట్నం కేటాయించాలని సీపీఎం జాబితా సమర్పించింది. అయితే, మిర్యాలగూడ కేటాయింపుపై స్పష్టత వచ్చినా, రెండో సీటుపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో సీపీఎంతో చర్చలు జరిపే బాధ్యతను రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ లకు అప్పగించారు. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు కేటాయించాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనకు ఆ పార్టీ అంగీకరించడంతో, ఆ టికెట్లు ఆశించిన కాంగ్రెస్ నేతలను బుజ్జగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కేటీఆర్ పై రేవంత్ విమర్శలు
మరోవైపు, మంత్రి కేటీఆర్ తప్పుడు ప్రచారాల్లో రాటు దేలారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ చూసి ఫేక్ ప్రచారాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. కర్ణాటకలో అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే ఇచ్చిన గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రూ.కోట్లు కుమ్మరించినా, తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.