Dalita Dandora Live Updates: సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో కాంగ్రెస్‌ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళ, బుధ వారాల్లో మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష జరగనుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమై రేపు సాయంత్రం 5కు ముగియనుంది.

FOLLOW US: 
కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పోటాపోటీగా ఫ్లెక్సీలు

దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష జరుగుతోన్న మూడు చింతలపల్లిలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఆత్మగౌరవ దీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఫ్లక్సీలను ఏర్పాటు చేశాయి. ఇక టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిలో కేసీఆర్ దత్తత గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులతో కూడిన పూర్తి వివరాలను పొందుపరిచారు. ఇరు పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ప్రారంభం

టీపీసీసీ ఆధ్వర్యంలో మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మూడు చింతలపల్లికి చేరుకుని దీక్షను ప్రారంభించారు. ఈ ఆత్మగౌరవ దీక్ష రేపు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీక్ష వేదికకు చేరుకునే ముందు.. శామీర్‌పేటలోని కట్ట మైసమ్మ ఆలయంలో రేవంత్‌ సహా నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష

కాంగ్రెస్ దీక్ష కోసం మూడు చింతలపల్లి ఊరు బయట భారీ శిబిరం ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా వాటర్‌ ప్రూఫ్‌ షెడ్‌ సిద్ధం చేశారు. ఈ దీక్షకు 15 వేల నుంచి 20 వేల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో రెండు రోజుల పాటు జరిగే దీక్ష ఇవాళ ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు దళిత, గిరిజన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి దీక్షను ఉద్దేశించి మాట్లాడతారు. 

దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు  సక్సెస్

హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో లబ్దిపొందేందుకు దళిత బంధు పథకాన్ని తెచ్చారని కాంగ్రెస్‌ విమర్శిస్తుంది. ఆ పథకానికి వ్యతిరేఖం కాదని చెబుతున్న కాంగ్రెస్ రాష్ట్రం వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ నెల 9న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు ఇంద్రవెల్లి నుంచి శ్రీకారం చుట్టింది. రావిర్యాలలో కూడా సభను నిర్వహించింది. ఈ రెండు సభలకు ప్రజాస్పందన భారీగా వచ్చింది. దీంతో పార్టీ రాజకీయ వ్యవహారాల ముఖ్య నాయకులు 48 గంటల దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. 

వేదిక వద్ద ఏర్పాట్లు

దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్షకు సిద్ధమవుతోన్న వేదిక

Background

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళ (ఆగస్టు 24), బుధ వారాల్లో మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష జరగనుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమై రేపు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రెండు రోజుల పాటు చేపట్టే ఈ దీక్షలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు. మూడుచింతలపల్లి సీఎం కె.చంద్రశేఖర్ రావు దత్తత తీసుకున్న గ్రామం కావడంతో కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూడుచింతలపల్లి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదనే విషయాన్ని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ దీక్ష చేయాలని నిర్ణయించినట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

దళితవాడలో రేవంత్ బస

మంగళవారం రాత్రికి దళితవాడలో రేవంత్‌ రెడ్డి బస చేస్తారు. బుధవారం ఉదయం రచ్చబండ మాదిరి దళిత వాడలో స్థానికులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డినే దీక్షలో కూర్చోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ అంచనా వేస్తుంది. దీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పీసీసీ చెప్పింది.