Asifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Tiger In Asifabad District: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి తిరగడం నిజమేనని అటవీ శాఖ అధికారి ABP Desam తో మాట్లాడుతూ తెలిపారు.
![Asifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం Tiger spotted beside highway in Komuram Bheem Asifabad district Asifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/d27aa956dda87431dc57adeae56afc811732641544484233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tiger In Asifabad District: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. వాంకిడి మండలంలోని దాబా శివారులో గత రెండు రోజుల క్రితం పశువులపై పెద్దపులి దాడి చేసింది. పులిదాడితో అడవిలో పశువులు మేపుతున్న కాపర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పశువులపై పెద్దపులి దాడి చేసిన సమయంలో అక్కడి దృశ్యాలను గాయపడ్డ పశువులను తమ సెల్ ఫోన్ ద్వారా విడియో తీశారు. పులి పశువులపై దాడి చేసి... సమీపంలోనే ఉండి చూస్తుందని, వారు వీడియో తీస్తున్న క్రమంలో మాట్లాడుకుంటున్నారు. ఆపై కేకలు గట్టిగా వేయగా పులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది అని చెబుతున్నారు.
పెద్దపులి సంచారం నిజమేనన్న అధికారి
ఈ విషయమై ఆసిఫాబాద్ అటవీ శాఖ అధికారి గోవించంద్ సర్దార్ ని ఏబీపీ దేశం ఫోన్ ద్వారా వివరణ కోరగా... ఆయన మహారాష్ట్ర మీదుగా వాంకిడి, ధాభా సరిహద్దులో పులి సంచారం వాస్తవమేనన్నారు. పులి సంచరించి పశువులపై దాడి చేసిందని చెప్పారు. పులి పాదముద్రలు సేకరించి అక్కడ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పులి మహారాష్ట్ర వైపు నుండి వచ్చిందని చెబుతున్నారు.
జాతీయ రహదారి పక్కనే పెద్దపులి
ఇదిలా ఉండగా మంగళవారం తాజాగా ఆసిఫాబాద్ చంద్రపూర్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి పక్కనే పెద్దపులి అక్కడి స్థానికులకు కనిపించింది. ఆదివాసీల దేవస్థానపు జెండా వద్ద అక్కడే తిరుగుతూ అక్కడి నుండి అటవీ ప్రాంతం వైపు పెద్దపులి వెళ్ళింది. పెద్దపులిని చూసిన స్థానికులు వాహనంలో నుండి సెల్ ఫోన్ ద్వారా పెద్దపులి వీడియోను చిత్రీకరించారు. తమకు పులి కనిపించిందని వారి మిత్రులకు సోషల్ మీడియా వాట్సప్ గ్రూపులలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేరామరిలో మరో పులి సంచారం
కాగా, అటు కేరామరి ప్రాంతంలోనూ మరొక పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. కెరామేరి రేంజ్ అధికారి మజరుద్దీన్ ఏబీపీ దేశం,కు ఫోన్ ద్వారా వివరణ ఇచ్చారు. తమ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచరిస్తుందని ఇదివరకి చెప్పిన విషయం తెలిసిందే.. అయితే ఆ పులి ఇప్పుడు అనార్ పల్లి , దేవాపూర్, అడ్డేసరా, చింతకర్ర, సోమ్లానాయక్ తండా మార్గం మధ్యలో సంచరిస్తుందని, పెద్దపులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ పంట చెలలో విద్యుత్ కంచెలను తొలగించేలా.. వారికి అవగాహన కల్పిస్తూ... పులి సంచరిస్తున్న తరుణంలో వ్యవసాయ రైతులు.. పత్తి ఏరే కూలీలు.. జాగ్రత్తగా ఉండాలని, గుంపులు గుంపులుగా తమ పనులు చేసుకోవాలని అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
గత కొన్ని రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులను పులులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటికి తోడు మహారాష్ట్ర నుంచి వచ్చిన జానీ సైతం అటవీశాఖ అధికారులతో పాటు ప్రజలను టెన్షన్ పెట్టింది. పులుల భయంతో రైతులు, గ్రామస్తులు సాయంత్రం వేళ, రాత్రిపూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)