Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pithapuram News| పిఠాపురంలో రైల్వే హాల్ట్ మంజూరు చేయాలని, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలనీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు పవన్ కల్యాణ్

Railway Overbridge in Pithapuram | న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం కోసం ఆలోచిస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సామర్లకోట – ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవసరం ఉందని, సత్వరమే ఈ ఆర్వోబీని మంజూరు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
పిఠాపురంలో పనులపై కేంద్రాన్ని కోరిన పవన్ కళ్యాణ్
మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు రైల్వే ప్రాజెక్టులు, ప్రజల అవసరాల గురించి కేంద్ర మంత్రితో చర్చించారు. పిఠాపురం పట్టణ పరిధిలోని V-V సెక్షన్‌లో, సామర్లకోట- ఉప్పాడ రోడ్డులో రైల్వే కి.మీ 640/ 30-32 వద్ద లెవెల్ క్రాసింగ్ నంబర్ 431కి బదులుగా ఆర్‌ఓబీ (Pithapuram ROB) అవసరమని కూటమి ప్రభుత్వం గుర్తించింది. నిరంతరం ఉండే ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, ఆ ప్రాంతంలో రోడ్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి మౌలిక సదుపాయాలు కల్పించడం చాలా అవసరం. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి 'గతి శక్తి' కార్యక్రమం ద్వారా మంజూరు చేయాల’ని పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిని కోరారు.
అదే విధంగా పిఠాపురంలోని శ్రీపాద వల్లభ స్వామి దేవాలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం 4 ముఖ్యమైన రైళ్ళకు పిఠాపురం రైల్వే స్టేషన్లో (Pithapuram Railway Station) హాల్ట్ మంజూరు చేయాలని పవన్ విజ్ఞప్తి చేశారు. నాందేడ్ - సంబల్పూర్ నాగావళి ఎక్స్ ప్రెస్, నాందేడ్ - విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, విశాఖపట్నం- సాయి నగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్, ఏపీ ఎక్స్ ప్రెస్ (విశాఖపట్నం - న్యూఢిల్లీ)కి పిఠాపురంలో హాల్ట్ అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం కేంద్రానికి తెలిపారు.
ఈ సందర్భంగా – లాతూరు ప్రజలు చేసిన విన్నపాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ముందు ఉంచారు. లాతూరు నుంచి తిరుపతి (Tirupati)కి రైలు ఏర్పాటు చేయాలని కోరిన ప్రతిపాదనపై పరిశీలన చేయాలని కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

