CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Bandi Bhageerath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై నమోదైన కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణాధికారిగా మహిళా ఆఫీసర్ నియామకం, బీఆర్ఎస్ నేతల విమర్శలకు కౌంటర్.. పూర్తి వివరాలు ఇక్కడ.

Bandi sanjay son case: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో భిన్నంగా స్పందించారు. ఈ కేసు విచారణ తీరుపై మంగళవారం మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్-చాట్‌లో ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ కేసును తాను స్వయంగా డీజీపీ ,ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించినట్లు సీఎం తెలిపారు.
కేసు ఆలస్యానికి కారణం
మే 8వ తేదీనే పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే, మే 9, 10 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఉండటంతో సుమారు 10 వేల మంది పోలీసులు భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారని రేవంత్ గుర్తు చేశారు. డీజీపీ నుండి కింది స్థాయి అధికారి వరకు అందరూ పీఎం సెక్యూరిటీలో ఉండటం వల్లే విచారణలో స్వల్ప జాప్యం జరిగిందని, ఇప్పుడు దర్యాప్తు వేగవంతమైందని స్పష్టం చేశారు.
మహిళా ఆఫీసర్ నేతృత్వంలో విచారణ
ఈ కేసు అత్యంత సున్నితమైనది, మైనర్ బాలికకు సంబంధించినది కావడంతో, దీనిని ఒక సీనియర్ మహిళా పోలీస్ అధికారికి అప్పగించాలని సీఎం డీజీపీని ఆదేశించారు. బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిందితులు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని రేవంత్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నేతలకు సీఎం కౌంటర్
బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేస్తున్న విమర్శలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మీడియా ముందు మాట్లాడినంత మాత్రాన విచారణలు జరగవు. కేటీఆర్, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఖాళీగా ఉన్నారని దర్యాప్తు అధికారులుగా వ్యవహరిస్తామంటే కుదరదు అని ఎద్దేవా చేశారు. రిటైర్డ్ పోలీస్ అధికారి అయిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కు నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన మాట మార్చిన తీరును రేవంత్ గుర్తు చేస్తూ ఆయన నైతికతను ప్రశ్నించారు. ఒక మైనర్ బాలికకు సంబంధించిన విషయం కాబట్టి అందరూ బాధ్యతగా ఉండాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
పక్షపాతం లేదు.. గతంలోనూ చర్యలు తీసుకున్నాం
గతంలో కేటీఆర్ బంధువుకు సంబంధించిన డ్రగ్స్ కేసులో కూడా తాము వెనకాడకుండా చర్యలు తీసుకున్నామని రేవంత్ గుర్తు చేశారు. బండి భగీరథ్ కేసులో కూడా పోలీసులు స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఎవరికీ మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ విమర్శల కోసం అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని ఆయన హితవు పలికారు.
Before You Go
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
ట్రెండింగ్ వార్తలు






















