Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ఆకస్మిక పర్యటనకు అసలు కారణం ఇదేనా!
Revanth Reddy Delhi Tour: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్ధేరి వెళ్తారు. అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంగళవారం పరామర్శించనున్నారు.
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ(Delhi)కి బయల్దేరారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం (Begumpet Airport) నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయల్ధేరి వెళ్తారు. ఇటీవల జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge)ను మంగళవారం పరామర్శించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీలోని పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.
అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై మాట్లాడనున్నారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీలో టీపీసీసీ(TPCC) కార్యవర్గం పైన చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుందో అని నేతల్లో ఉత్కంఠ నెలకొంది. దసరాలోపు మంత్రి వర్గాన్ని చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని సమాచారం. అంతే కాకుండా హైడ్రా, మూసీ ప్రక్షాళన తదితర అంశాలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న కారణాలను ఆయన అధిష్ఠానానికి వివరించే అవకాశం ఉంది.
మోదీని గద్దె దించి తీరుతానన్న మల్లికార్జున ఖర్గే
ఇది ఇలా ఉంటే కథువా బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగా ఉన్నట్టుండి అదుపు తప్పి కింద పడబోయారు. పక్కనే ఉన్న నేతలు ఖర్గేను కిందపడకుండా గట్టిగా పట్టుకున్నారు. కాసిన్ని నీళ్లు తాగిన ఖర్గే.. మళ్లీ ప్రసంగం కొనసాగించారు. ఆయన అస్వస్థతకు గురికాక ముందే తనకు 83ఏళ్లు అయినప్పటికీ.. ఫిట్ గా ఉన్నాని అన్నారు. మోదీ సర్కార్ ను గద్దె దించే వరకు తాను బతికే ఉంటానన్నారు. జమ్ము కాశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు.
మంత్రి వర్గ విస్తరణ
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు పది నెలలు అవుతుంది. ఇంకా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ కాలేదు. గత నాలుగు నెలలుగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరగుతుంది తప్పా..అది వాస్తవ రూపం దాల్చడం లేదు. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసి ఐదు నెలలు అవుతున్నా ..మంత్రి వర్గ విస్తరణ జరుగలేదు. నెలల కొద్ది సమయం గడుస్తున్నా మంత్రివర్గ విస్తరణలో మాత్రం స్పష్టత రావడం లేదు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి ఇక తమకు మంత్రి పదవి ఖాయం అన్నట్లుగా నేతలు తెగ ఫీలవుతున్నారు. మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అన్న సమాచారాన్ని అనుయాయుల ద్వారా తెలుసుకుంటున్నారట. ఇలా రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతల పరిస్థితి ఇలానే ఉంటుందని సమాచారం. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లడం , మంత్రి పదవి వస్తుందని నేతలు జిల్లాలో హడావుడి చేయడం పరిపాటిగా మారింది తప్పా మంత్రి వర్గ విస్తరణ మాత్రం జరగడం లేదు.
నేతల లాబీయింగ్
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పేరును కాంగ్రెస్(Congress) అధిష్టానం అధికారికంగా ప్రకటించారు. దీంతో నేతల్లో మరోసారి ఆశలు చిగురెత్తాయి. పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించారంటే త్వరలో కేబినెట్ విస్తరణ కూడా ఉంటుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు మంత్రి పదవి ఖాయం అని కలలు కంటున్నారు. ఈ సారి దసరాలోపు కేబినెట్ విస్తరణ ఉంటుందని తాజాగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దీంతో నేతలు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దపడుతున్నారు. దీంతో తమకు అనుకూలంగా ఉన్న వర్గాల ద్వారా ఢిల్లీ పెద్దలతో రాయబారం నడుపుతున్నారట. కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధిష్టానం పెద్దలతో పలు మార్లు సంప్రదింపులు జరిపారు. ఐనా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంపై కాంగ్రెస్ లో తీవ్ర చర్చ జరుగుతుంది.