CM Revanth Reddy: తెలంగాణలో ఆరోగ్య ఉత్సవాలకు శ్రీకారం - 213 అంబులెన్సులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Arogya Utsavalu: తెలంగాణలో ఆరోగ్య ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి సోమవారం 213 అంబులెన్సులను ప్రారంభించారు. అలాగే, 28 పారా మెడికల్, 16 నర్సింగ్ కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభించారు.
CM Revanth Reddy Inaugurated 213 Ambulances: తెలంగాణలో ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే 213 అంబులెన్సులను ప్రారంభించారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని (NTR Marg) హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో 108, 102 వాహనాలకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 108 సర్వీసుల కోసం 136 అంబులెన్సులు, 102 సర్వీసుల కోసం 77 అంబులెన్సులను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సీఎం సహా మంత్రులు పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలను వర్చువల్‌గా సీఎం ప్రారంభించారు. 33 ట్రాన్స్‌జెండర్ల క్లినిక్‌లను ప్రారంభించడం సహా 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 24 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ప్రారంభించిన వాటితో కలిపి రాష్ట్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల సంఖ్య 37కు చేరింది. కాగా, మైత్రి ట్రాన్స్ క్లినిక్‌లు గురువారం నుంచి సేవలందించనున్నాయి.
కోకాకోలా కంపెనీని ప్రారంభించిన సీఎం
అంతకు ముందు సిద్ధిపేట జిల్లాలో కోకాకోలా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బండ తిమ్మాపూర్‌లో రూ.1000 కోట్లతో దీన్ని నిర్మించగా.. సోమవారం సీఎం ప్రారంభించారు. అనంతరం ప్లాంట్‌లో కలియతిరుగుతూ మంత్రులతో కలిసి పరిశీలించారు. కూల్ డ్రింక్ తయారీ వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాగా, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి. అటు, సీఎం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత నర్సారెడ్డిని పోలీసులు అనుమతించక పోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కంపెనీ గేటు ధ్వంసం చేసి కార్యకర్తలు లోపలికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపు చేశారు.
సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ లో HCCB - కోకా కోలా ఫ్యాక్టరీని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ డి.శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించడం జరిగింది.
— Revanth Reddy (@revanth_anumula) December 2, 2024
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీమతి కొండా సురేఖ పాల్గొన్నారు. pic.twitter.com/4VhDGibQtd