Revanth Reddy About KCR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేసీఆర్‌కు ఇష్టం లేదు- సీఎం రేవంత్ రెడ్డి సంచలనం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి మాజీ సీఎం కేసీఆర్ పార్టీ సిద్ధంగా లేదని, మా నిర్ణయాన్ని స్వాగతించింటే కేసీఆర్ పెద్దరికం పెరిగేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

42 percent reservation for BCs | హైదరాబాద్: బీసీలకు జనాభా ఆధారంగా న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలన్నది తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపినట్టు తెలిపారు. అయితే, రాష్ట్ర గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపారని వెల్లడించారు. ఆ రిజర్వేషన్ బిల్లులు గత ఐదు నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని రేవంత్ రెడ్డి వివరించారు.
పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలలో సవరణలపై శాసనసభలో చర్చ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. " బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధంగా లేరని, వందేళ్లుగా చేయని పనిని మేం చేస్తున్నందుకు మమ్మల్ని అభినందించి ఉంటే కేసీఆర్ పెద్దరికం పెరిగి ఉండేదని వ్యాఖ్యానించారు. మీరు చేసిన తప్పులకు ప్రజలు ఇప్పటికే శిక్ష విధించారని, అయినా మారకపోతే ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా మిగల్చరని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుదిబండగా మారిన బీఆర్ఎస్ తెచ్చిన చట్టం
స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయన్న కారణంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరిపేందుకు ఆదేశించడంతో పాటు, రిజర్వేషన్లను నిర్ణయించాలని సైతం స్పష్టం చేసింది. 2018లో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం, 2019లో వచ్చిన మున్సిపల్ చట్టం ప్రకారం 50 శాతం రిజర్వేషన్ పరిమితి ఉంది. బీఆర్ఎస్ తెచ్చిన చట్టమే నేడు వెనుక బడిన తరగతుల వారికి గుదిబండగా మారింది. ఈ చట్టాల్లో స్పష్టత లేకపోవడంతో మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. అయితే, గవర్నర్ ఆ ఆర్డినెన్స్‌ను అమలు చేయడానికి బదులుగా రాష్ట్రపతికి పంపారు. బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌ను తప్పుదోవ పట్టించడం వల్లే ఇది జరిగిందని’ అన్నారు.
రిజర్వేషన్లు పెంచడం కేసీఆర్‌కు ఇష్టం లేదన్న రేవంత్ రెడ్డి
"బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఢిల్లీలో అఖిలపక్షాన్ని సమీకరించలేదు. మేము ఐదు సార్లు ఈ విషయంలో ప్రధానిని కోరుతూ లేఖలు రాశాం, కానీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దాంతో జంతర్‌మంతర్‌లో ధర్నా చేశాం. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 100 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. కానీ, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు స్పందించలేదు. గంగుల కమలాకర్ కూడా హాజరుకాలేదు. వారి పార్టీ నేత బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇవాళ కూడా సభలో గందరగోళం సృష్టిస్తూ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకుంటున్నారు. ప్రజలే అధికారానికి అధారం. మేము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సహకరించకపోతే, ప్రజలే మీకు సరైన బుద్ధి చెబుతారు" అని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.
కొన్ని పార్టీలు అసత్య ప్రచారంతో బలహీన వర్గాలలో అనుమానాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సభను వేదికగా చేసుకొని బలహీన వర్గాల హక్కులను దెబ్బతీయడం సరైంది కాదు. గంగుల కమలాకర్ తప్పుడు సమాచారం ఇవ్వడం బాధాకరం. ప్రజల్లో అపోహలు కలగకుండా జాగ్రత్త వహించాలి. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల సాధనకు తీసుకున్న చర్యలను సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు.
"మొదట బీసీ కమ్యూనిటీ వివరాల సేకరణ బాధ్యతను రాష్ట్ర బీసీ కమిషన్‌కు అప్పగించాం. బీసీ కమిషన్ ద్వారా కాకుండా ప్రత్యేకంగా డెడికేషన్ కమిషన్ ద్వారా సమాచార సేకరణ జరగాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ (నెం. 30381/2024) వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రభుత్వంగా చిత్తశుద్ధితో స్పందించి కమిషన్‌ను ఏర్పాటు చేశాం" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆ రాష్ట్రాల తరహాలో సమస్యలు రావొద్దు
డెడికేషన్ కమిషన్ ఆధ్వర్యంలో కుల సర్వేను సమగ్రంగా నిర్వహించి, బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకున్నట్టు సీఎం వెల్లడించారు. బీహార్, రాజస్థాన్‌లలో రిజర్వేషన్ల అమలులో ఎదురైన అడ్డంకులను గమనించి, "అలాంటి సమస్యలు తెలంగాణలో రాకూడదన్నదే మా దృష్టి. అందుకే అధికారుల కమిటీలు, మంత్రులు వెళ్లి ఇతర రాష్ట్రాల అనుభవాలను అధ్యయనం చేశారు" అని వివరించారు. న్యాయపరమైన పరిణామాలను విశ్లేషించిన తరువాతనే డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
"ఈ ప్రక్రియను 2024 ఫిబ్రవరి 4న ప్రారంభించి, ఈ ఫిబ్రవరి 4న పూర్తి చేశాం. కేవలం 365 రోజుల్లో చట్టబద్ధంగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాం. ఇప్పుడు స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మే చిత్తశుద్ధితో పని చేస్తున్నాం" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.






















