Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు
Debate on Project panchayatraj amendment act 2025 | పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

Telangana Assembly Sessions | హైదరాబాద్: తెలంగాణలో శాసనసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై వాస్తవాలు తేల్చేందుకు తాము ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నాడు సభలో ప్రవేశపెట్టింది. సభకు హాజరైన ఎమ్మెల్యేలకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పెన్‌డ్రైవ్‌లో ఇచ్చారు.
మృతిచెందిన నేతలకు సభ సంతాపం
ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి మృతిపట్ల సభ సంతాపం తెలిపింది. 2009 నుంచి 2014 వరకు ఉప్పల్ ఎమ్మెల్యేగా చేశారు. కాప్రా మున్సిపాలిటీ చైర్మన్‌గా సైతం ఆయన సేవలు అందించారు. 2012లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా చేశారు. మే 8న బండారు రాజిరెడ్డి కన్నుమూశారని తెలిసిందే. ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ సభ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యే మృపట్ల సభ్యులు ప్రగాడ సానుభూతి తెలిపారు. గతంలో ఆయన ప్రభుత్వ టీచర్‌గా చేశారు. ఎంపీటీసీగా, సర్పంచ్, ఎమ్మెల్యేగా సేవలు అందించారు.
బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం..
పురపాలక, పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుతో పాటు అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ (Medical Care) ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధన సవరణ బిల్లుపై సభలో చర్చ ప్రారంభించారు. దీనిపై చర్చ జరుగుతున్నందున ఆర్డినెన్స్ కుదరదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పురపాలక చట్టం 2019 నిబంధన సవరణ చట్టం తెచ్చినట్లు ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ రాష్ట్ర కేబినెట్ శనివారం నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జీవో జారీ చేస్తామని పేర్కొన్నారు. ఈ మార్పుల కోసమే పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు తెచ్చినట్లు తెలిపారు.
సమగ్ర సర్వే నివేదిక, ఏకసభ్య కమిషన్ సిఫార్సులతో నిర్ణయం
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ సహా మున్సిపాలిటీలలో పదవుల్లో ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన జాతులకు సీట్లు కేటాయించడం, మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని పురపాలక, పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లు 2025 తీసుకొచ్చాం. రాష్ట్ర జనాభా ఆధారంగా ఆయా కులాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమగ్ర సర్వే విషయాలను పరిగణనలోకి తీసుకుని వారికి తగిన ప్రాతినిథ్యం కల్పిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2024లో చేసిన సీపెక్, సమగ్ర సర్వేను లోతుగా విశ్లేషించి ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ వెనుకబడిన తరగతుల వెనుకబాటు కొనసాగుతుందని తెలిపింది. అందుకే వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పురపాలికలు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సైంటిఫిక్ సర్వే చేసి రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. బలహీనవర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడదాం. ఇతర సభ్యులు తమ విలువైన సూచనలు ఇస్తే వాటని పరిశీలిస్తామని’ చెప్పారు.
విపక్షాలు అభ్యంతరం..
6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్లు అమలు ఎందుకు చేయకపోయారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్లు వస్తే సంతోషించే తొలి వ్యక్తిని తానేనన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపిన తాము అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని చెబితే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మంత్రి శ్రీధర్ బాబుకు వాస్తవాలు తెలియవు అని విమర్శించారు.






















