Revanth Delhi Speech: రాష్ట్రపతి ఆమోదం లభించేవరకూ పోరాటం - బీసీ బిల్లుపై జంతర్ మంతర్‌లో సీఎం రేవంత్ ధర్నా
Revanth Delhi Speech: బీసీ రిజర్వేషన్లకు రాష్ట్రపతి ఆమోదం లభించేవరకూ పోరాడతామని తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటించారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిర్వహించిన ధర్నాలో రేవంత్ ప్రసంగించారు.

Telangana CM Revanth Jantar Mantar Dharna: బీసీ రిజర్వేషన్లు ఆమోదం పొందే వరకూ పోరాటం ఆపేది లేదని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల కోసం నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని వివరించారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశవ్యాప్త కులగణన అవసరమని వచ్చిన డిమాండ్‌ను గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో, తెలంగాణలో చరిత్రాత్మకంగా కులగణనను విజయవంతంగా నిర్వహించామని, దాని ఆధారంగా విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించినట్లు తెలిపారు. ఈ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందని, దీనిని త్వరగా ఆమోదించాలని కోరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు..
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతిపత్రం సమర్పించేందుకు అపాయింట్‌మెంట్ కోరామని, అయితే ఇప్పటివరకు అపాయింట్‌మెంట్ లభించలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి కార్యాలయంపై ఒత్తిడి తెస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర అసెంబ్లీలో ఈ బిల్లులకు మద్దతు ఇచ్చినప్పటికీ, కేంద్రంలో వాటిని అడ్డుకుంటోందని ఆరోపించారు
రాష్ట్రపతి ఆమోదం లభించే వరకు బీసీ రిజర్వేషన్లు అమలు కావని, అందుకే తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30, 2025 లోపు నిర్వహించాలని ఆదేశించిందని ఈ బిల్లు ఆమోదం లేకుండా ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని ఆయన తెలిపారు. బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇది ఒక్కటే కాదని, భవిష్యత్తులో మరిన్ని బలమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
★ 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ #Congress పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది.
— AIR News Hyderabad (@airnews_hyd) August 6, 2025
★ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. pic.twitter.com/3XcWzfiKRc
రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లులను కేంద్రం ఆమోదించకపోతే, ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించే దిశగా దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. బీసీ వర్గాల మనోభావాలను దెబ్బతీసే చర్యలను సహించబోమని, అవసరమైతే ప్రజల శక్తితో ఈ బిల్లులను ఆమోదింపజేస్తామని ఆయన ఉద్ఘాటించారు. కేంద్రం ఈ బిల్లులను వీలు చూసి అడ్డుకుంటుందనే అనుమానం ఉందని, రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ బిల్లులను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ “జిత్నీ ఆబాదీ, ఉత్నా హిస్సేదారీ” (జనాభాకు తగినట్లు ప్రాతినిధ్యం) నినాదం నుండి ప్రేరణ పొందిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ కుల గణన (SEEEPC) నిర్వహించింది. ఈ గణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్ బిల్లులను రూపొందించి, రాష్ట్ర శాసనసభలో ఆమోదించింది. ఈ బిల్లులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం వేచి ఉన్నాయి
ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇండియా బ్లాక్‌లోని సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీలు, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్పీ) నాయకులు కూడా పాల్గొని మద్దతు తెలిపారు. ఈ ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, సామాజిక న్యాయం కోసం నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.





















