Komatireddy Rajagopal Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయలేదంటూనే ఇరకాటంలో పెట్టిన రాజగోపాల్ రెడ్డి
అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశాడని జరుగుతున్న ప్రచారంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను రేవంత్ రెడ్డిని విమర్శించలేదని, సలహాలు మాత్రమే ఇచ్చానన్నారు.

Komatireddy Rajagopal Reddy | హైదరాబాద్: మంత్రి పదవి తనకు ఇచ్చి తీరాల్సిందేనని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తాను విమర్శించడం లేదని, కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తున్న అన్నారు. అధిష్టానం పిలుపుమేరకే తాను కాంగ్రెస్ లోకి వచ్చా నని.. అధిష్టానం మంత్రి పదవి హామీ ఇచ్చి తీసుకొచ్చిందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పాలకులు ఎవరైనా సరే డిజిటల్ మీడియా సోదరులను అవమానించకూడదు అది పాలసీ కాదు అని చెప్పానన్నారు. ప్రజల అభిప్రాయం మాత్రమే చెబుతున్నానని, అందులో తన వ్యాఖ్యలు లేవన్నారు. ప్రభుత్వ పెద్దలు భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకుంటే మంచిదన్నారు. వీలైనంత తొందరగా మంత్రి పదవులను భర్తీ చేసి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
ప్రతిపక్షనేతగా కేసీఆర్ తప్పుకోవాలి..
‘అధికారం పోయింది అన్న ఫ్రస్టేషన్లో టిఆర్ఎస్ పార్టీ ఉంది. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదాలో కొనసాగే అర్హత కేసీఆర్‌కు లేదు. కనుక కేసీఆర్ అసెంబ్లీ కైనా రావాలి లేదంటే ప్రతిపక్ష హోదా నాయకుడిగా వేరే నేతను నియమించాలి. తుమ్మిడి హట్టి వద్ద ఉన్న ప్రాజెక్టును మేడిగడ్డ వరకు తీసుకొచ్చి లక్షల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అందుకే కెసిఆర్, బి ఆర్ ఎస్ నేతలు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కోల్పోయారు. రాబోయే రోజుల్లో బి ఆర్ఎస్ పార్టీ ఉండదు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించింది కేసీఆర్. ఆంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయటపెడతా’ అన్నారు.
జాప్యం లేకుండా వారిని జైళ్లో పెట్టాలి..
రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ కాంట్రాక్టర్ల విషయంలో, భూముల, ఇసుక మాఫియా విషయంలో, మరే విషయంలోనైనా సరే తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు అన్యాయం ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ఐదేళ్లు అధికారంలోనే ఉంటుందని దీమా వ్యక్తం చేశారు. ఎక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుంది కనుకే నేను చెప్తున్నా అన్నారు. కాళేశ్వరం తో పాటు మిగతా ప్రాజెక్టుల్లో కెసిఆర్ ఫ్యామిలీతో పాటు సీమాంధ్ర కాంట్రాక్టర్లు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. కనుక
విచారణల పేరుతో కాలయాపన చేయకుండా 10 ఏళ్లు అవినీతి చేసి దోచుకున్న వారిని వీలైనంత తొందరగా జైల్లో పెట్టాలని సూచించారు.
ఇదివరకే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. మరోవైపు ఇంటి నుంచి ఒకటే మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ మొదట్నుంచీ చెబుతోంది. దాంతో రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వాలంటే సోదరుడు వెంకట్ రెడ్డి పదవి వదులుకోవాల్సి వస్తుంది. సామాజిక సమీకరణాలు చూసుకున్న రెడ్డి సామాజిక వర్గానికి మరో మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.






















