Chiru KCR : చిరంజీవికి కేసీఆర్ ఫోన్ .. ఆరోగ్య పరిస్థితిపై ఆరా! ఇంకా ఏం చర్చించారంటే ?
తెలంగాణ సీఎం కేసీఆర్ చిరంజీవికి ఫోన్ చేశారు. కరోనా బారిన పడిన చిరంజీవిని పరామర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిరంజీవికి ఫోన్ చేశారు. చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్‌లో ప్రకటించారు. విషయం తెలిసిన సీఎం కేసీఆర్ నేరుగా ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసినట్లుగా తెలుస్తోంది. అంతా బాగుందని స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని డాక్టర్ల సలహాలతో యాంటీబయాటిక్స్ వాడుతున్నానని చిరంజీవి కేసీఆర్‌కు తెలిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హోమ్ ఐసోలేషన్‌లోనే ఉన్నారు.
గతంలో చిరంజీవి ఓ సారి కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు రెండో సారి. చిరంజీవి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా సోకింది. చిరంజీవికి కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు, లోకేష్ సహా పలువు ట్విట్టర్‌లో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. గతంలో చంద్రబాబు,లోకేష్ కరోనా బారిన పడినప్పుడు చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. జగన్ కూడా వారికి ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ మాత్రం నేరుగా ఫోన్ చేసి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు.
చిరంజీవి ఇటీవలి కాలంలో రెండు, మూడు సార్లు కేసీఆర్‌తో సమావేశమయ్యారు. టాలీవుడ్ సమస్యలపై చర్చించేందుకు నాగార్జునతో కలిసి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా ఇండస్ట్రీ కోసం చర్చలు జరిపారు. చిరంజీవి చర్చల ఫలితంగానే టాలీవుడ్‌కు తెలంగాణ ప్రభుత్వం నుంచి పలు రకాల ప్రోత్సాహకాలు లభించాయి. కరోనా కారణంగా దెబ్బతిన్న పరిశ్రమకు కేసీఆర్ ఇచ్చిన మినహాయింపులు కోలుకోవడానికి సహకరించాయని పలుమార్లు చిరంజీవి బహిరంగంగానే చెప్పారు.
Also Read: కోవిడ్ బారిన పడ్డ చిరు.. త్వరగా కోలుకోవాలంటూ సెలబ్రిటీల ట్వీట్స్..
తెలంగాణ ప్రభుత్వం కూడా సినీ ఇండస్ట్రీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ఎక్కడా దూరం పెరగకుండా చూసుకుంటోంది. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ ధరలు.. ఇతర అంశాల్లో టాలీవుడ్‌ను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకున్నా.. తాము అలాంటి వి చేయబోమని.. ఏదైనా ఇండస్ట్రీ అంగీకారంతోనే చేస్తామని మంత్రి తలసాని పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు చిరంజీవికి కేసీఆర్ ఫోన్‌తో సుహృద్భావ సంబంధాలు మరింత బలపడనున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితులు సీరియస్‌గా ఉన్నాయి.. పాజిటివిటీ రేటు అంతకంతకూపెరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలు కరోనా నిబంధనలు పాటిచాంలని కోరుతోంది. టాలీవుడ్ కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అయితే షూటింగ్ అంటే నే ఎక్కువ మంది జనంతో చేయాల్సిన పని కాబట్టి కొంత మంది కరోనా బారిన పడుతున్నారు.