Telangana Cabinet : 12న తెలంగాణ కేబినెట్ భేటీ - మేనిఫెస్టోలోని కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్
Telangana : తెలంగాణ కేబినెట్ 12వ తేదీన సమావేశం కానుంది. పలు కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
Telangana Cabinet Meet : మార్చి 12న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ భేటీకి మంత్రులు, ఉన్నాతాధికారులు హాజరు కానున్నారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. తొలుత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ వర్తింపజేసేలా విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు. సొంత జాగా ఉన్నవారికి అదే స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తామని ఎన్నికల టైమ్ లోనే కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఎన్నికల కోడ్ వచ్చే ముందే ప్రారంభించాల్సిన పథకాలపై చర్చ
ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను లాంఛనంగా భద్రాచలంలో ప్రారంభించనున్న నేపథ్యంలో హడ్కో నుంచి రూ. 3,000 మేర రుణాలు సమకూర్చుకోడానికి హౌజింగ్ బోర్డుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మిలోని నెలకు రూ. 2,500 చొప్పున మహిళలకు ఆర్థిక సాయం అందించడంపైనే కేబినెట్ చర్చించి ఆమోదం పొందనున్నది. వీటికి తోడు విధానపరమైన మరికొన్ని అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికల కోడ్ రానుండడంతో ఈ లోపే ఆరు గ్యారంటీల్లో పెండింగ్‌లో ఉన్నవాటికి మంత్రివర్గం ఆమోదం పొందడంతో పాటు ఆన్-గోయింగ్ స్కీములుగా ఉంచేందుకు ప్రారంభోత్సవాలు చేయాలని అనుకుంటున్నారు.
టాటా గ్రూప్‌తో ఒప్పందం
సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో టాటా గ్రూప్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. సంబంధిత ఎంవోయూ పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయనుంది టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ . ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతున్న టాటా టెక్నాలజీస్ .. 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సులను నిర్వహిస్తుంది. ఈ 2024-25 విద్యాసంవత్సరం నుంచే ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం.