Telangana Cabinet: 21న తెలంగాణ కేబినెట్ భేటీ, రెండు పెద్ద అంశాలపై చర్చలు!
TS Cabinet Meet: ప్రధానంగా రెండు అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కానీ, ఉద్యోగుల డీఏకు సంబంధించిన విషయంపై మాత్రం చర్చ ఉండదని అంటున్నారు.
Telugu News: తెలంగాణ మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం (జూన్ 21) నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. 21న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 15లోగా రైతు పంట రుణాలను మాఫీ చేస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రధానంగా ఇదే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇంకా రుణమాఫీకి సుమారు రూ.30 వేల కోట్లు అవసరం కానున్నట్లు సమాచారం. మరోవైపు, రైతు భరోసాకు మరో రూ.7 వేల కోట్లు కావాల్సి ఉందని తెలుస్తోంది. ఈ పథకాల అమలు కోసం అన్ని నిధుల సేకరణ ఎలా చేయాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
రైతు రుణమాఫీకి సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపైన కూడా కేబినెట్ చర్చించనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల డీఏలపై చర్చ ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.