Telangana Cabinet: ఈ నెల 8న తెలంగాణ కేబినెట్ భేటీ - నెల రోజుల పాలన, 6 గ్యారెంటీల అమలుపై సమీక్ష
Telangana News: ఈ నెల 8న రాష్ట్రం కేబినెట్ భేటీ కానుంది. నెల రోజుల పాలన, 6 గ్యారెంటీల అమలుపై చర్చించే అవకాశం ఉంది.
Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ ఈ నెల 8న (సోమవారం) భేటీ కానుంది. నెల రోజుల పాలన, 6 గ్యారెంటీల అమలుపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా, వాటి ప్రాసెస్ సహా అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా కార్యాచరణ రూపొందించడం సహా పలు కీలక అంశాలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
నెల రోజులు - ప్రజాపాలన
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆదివారానికి (జనవరి 7) సరిగ్గా 30 రోజులు పూర్తైంది. పదవీ బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే ఇచ్చిన హామీల్లో రెండింటిని ప్రభుత్వం అమలు చేసింది. 'మహాలక్ష్మి' పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం బీమా మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచింది. మిగిలిన గ్యారెంటీల అమలు కోసం 'ప్రజాపాలన' ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. గ్రామాల్లో గ్రామ సభలు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గడేడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకూ 8 రోజుల పాటు ఈ ప్రక్రియ జరగ్గా.. మొత్తం 1,24,85,383 అర్జీలు వచ్చాయి. అన్ని దరఖాస్తుల ఎంట్రీని ఈ నెల 17 నాటికి పూర్తి చేసి.. అనంతరం అర్హతను బట్టి ఆయా పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేలా మంత్రివర్గం సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవే కాక టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన, ఉద్యోగాల భర్తీ, ఇతర ముఖ్యాంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
సీఎం రేవంత్ ట్వీట్
మరోవైపు, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 రోజులు పూర్తైన సందర్భంగా రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని.. పాలన ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందని అన్నారు. 'సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ.. పాలనను ప్రజలకు చేరువ చేస్తూ.. అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ, చైతన్యపు తెలంగాణ కోసం పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా - మీ రేవంతన్న' అంటూ ట్వీట్ చేశారు.
సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది.
— Revanth Reddy (@revanth_anumula) January 7, 2024
సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది.
పేదల గొంతుక… pic.twitter.com/gkzpRy1zGT
సంపదను ప్రజలకు పంచడమే లక్ష్యం
తెలంగాణ ప్రజల కలలను నిజం చేయడం సహా ఇచ్చిన హామీలను అమలు నెరవేర్చడానికి కృషి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 30 రోజుల పాలన కాంగ్రెస్ పాలనపై ఆయన ట్వీట్ చేశారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. అప్పులను అధిగమించి సంపద సృష్టించి పేదలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని చెప్పారు. ఎలాంటి భేషజాలకూ పోకుండా.. విభజన హామీల అమలు కోసం కేంద్రానికి విన్నవిస్తామని అన్నారు. ప్రస్తుతం ప్రజా సంక్షేమం, పాలన, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
Also Read: Telangana News: 'ప్రజాపాలన'కు దరఖాస్తుల వెల్లువ - ఎక్కువ మంది అప్లై చేసిందే వాటికే!