Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
Free Midday Meals Teachers: సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూసీ తొలి దశ, టిమ్స్ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీ సహా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Telangana Cabinet Meeting Decisions July 2026: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు చారిత్రాత్మక, సంక్షేమ నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే మౌలిక వసతుల ప్రాజెక్టులతో పాటు విద్యా, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా కేబినెట్ తీర్మానాలు చేసింది. ప్రధానంగా హైదరాబాద్ నగర ప్రతిష్టను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లే మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు మొదటి విడత పనులకు కేబినెట్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 21 కిలోమీటర్ల మేర సాగే ఈ ఫేజ్-1 పనుల కోసం ఏకంగా రూ.7,345.12 కోట్ల భారీ బడ్జెట్‌ను క్లియర్ చేయడంతో పాటు, ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా 147 కొత్త పోస్టులను మంజూరు చేసింది.
వైద్య రంగంలో నిరుద్యోగులకు సర్కార్ పెద్ద పీట వేసింది. హైదరాబాద్ నగర నలుమూలలా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.. సనత్ నగర్, ఎల్‌బీ నగర్, అల్వాల్‌లతో పాటు వరంగల్‌లోని టీఐఎమ్ఎస్ ఆసుపత్రులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఏకంగా 6,278 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ పోస్టులు, మరియు 4,235 అవుట్‌సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ భారీ నియామకాల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి దక్కడంతో పాటు, పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం మరింత చేరువ కానుంది.
విద్యాశాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన మానవీయ నిర్ణయానికి కేబినెట్ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు అందిస్తున్న ఉదయం అల్పాహారం , పాలు , మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని ఇకపై అక్కడ విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర నాన్-టీచింగ్ స్టాఫ్‌కు కూడా ఉచితంగా వర్తింపజేయాలని నిర్ణయించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.50 లక్షల మంది విద్యాశాఖ సిబ్బందికి నేరుగా లబ్ధి చేకూరనుంది.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టంపై తెలంగాణ కేబినెట్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ చట్టం దేశ సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధంగా ఉందని మంత్రివర్గం అభిప్రాయపడింది. అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో నిలిపివేస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి హామీ కూలీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే, కూలీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, జూలై 1, 2026 నుండి తాత్కాలికంగా ఈ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయిస్తూనే.. కేంద్ర వైఖరిపై సుప్రీంకోర్టులో చట్టపరమైన పోరాటం చేయాలని, అలాగే రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశాన్ని గట్టిగా నిలదీయాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించింది.
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, పంటల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా వరంగల్, రంగారెడ్డి జిల్లాలలో లభ్యంగా ఉన్న 60 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌కు గోదాముల నిర్మాణం కోసం కేటాయించారు. దీనితో పాటు, గ్రామీణ ప్రాంతాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలనే సంకల్పంతో.. మహబూబ్ నగర్, సూర్యాపేట జిల్లాలలో రెండు కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు, అలాగే జగిత్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి అవసరమైన భూములను కేటాయిస్తూ కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంది.
ట్రెండింగ్ వార్తలు





















