Telangana Budget: ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలంగాణనే నెంబర్ వన్ - ఈ లెక్కలే అందుకు ప్రూఫ్ !
Harish Rao Budget Speech: ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా తెలంగాణను అగ్రపథంలో నిలిపామని, కేంద్రం సహాయం లేకుండా సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే తలమానికంగా మారిందన్నారు.
Telangana Budget: మొన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. రుణాలు తెచ్చుకొని అభివృద్ధి చేసుకుందామన్నా సరే కేంద్రం అడ్డం పడుతుందన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలిపామని చెప్పారు. కేంద్రం సహాయం లేకుండా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే తలమానికంగా మారిందన్నారు.
ఆదాయంపై దొంగ దెబ్బ
కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తం నుంచి న్యాయబద్దంగా 41శాతం రాష్ట్రాలకు రావాల్సి ఉందన్నారు హరీష్ రావు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఈ వాటాను కుదించడానికి కేంద్రం సెస్సుల రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటుందన్నారు హరీష్. సెస్సుల రూపంలో వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఉందని గుర్తు చేశారు. ఇలా రాష్ట్రాలకు రావాల్సిన 11.4 శాతం ఆదాయానికి కేంద్రం గండి కొడుతోందన్నారు హరీష్. ఈ విధానాలను రాజ్యాంగ బద్ద సంస్థులు తప్పుబడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.
ప్రతికూల పరిస్థితుల్లో ప్రగతి పథం
ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రపథంలో తీసుకెళ్తున్నామన్నారు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు. ఆర్థికంగా బలమైన శక్తిగా మారేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా 50వేల కోట్ల రూపాయలను రైతులకు పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇది మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందని చివరకు కేంద్రం కూడా ఈ పథకాన్ని కాపీ చేసి అమలు చేస్తుందన్నారు.
రైతులకు భరోసా
ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే ఎలాంటి ప్రీమియం లేకుండానే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని అలా ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ఇలా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా 2022-23 బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు హరీష్‌రావు.
ప్రగతిలో దేశం కంటే ముందు వరుసలో
2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర జీఎస్‌డీపీ 4,51,580 కోట్ల రూపాయలని.. ఇప్పుడు అది 11, 54, 860 కోట్లకు చేరిందన్నారు హరీష్. 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధి రేటు జాతీయి సగటు కంటే ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. కరోనా విపత్తుతో దేశం సహా అన్ని రాష్ట్రాల్లో నెగెటివ్ గ్రోత్ రేటు ఉంటే తెలంగాణ మాత్రమే 2.2 శాతం పాజిటవ్ వృద్ధి రేటుతో ఉందన్నారు ఆర్థికమంత్రి. 2015-16 నుంచి 2020-21 మధ్య సగటున 11.7 శాతం ఆర్థిక వృద్ధి ని సాధించామన్నారు హరీష్. ఇలా వృద్ధి సాదిస్తున్న తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రగామిగా ఉందన్నారు.
దేశాభివృద్ధికి చేయూత
గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్‌డీపీ వృద్ధి రేటు స్థిర ధరల వద్ద 11.2 ఉంటుందని అంచనా వేశామన్నారు. ఇప్పుడు ఆ వృద్ధి రేటు 19.1 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు హరీష్. దేశ జీడీపీలో తెలంగాణ వాట 2014-15లో 4.06 శాతంగా ఉంటే 2021-22 నాటికి 4.97 శాతానికి పెరిగిందన్నారు. ఏడేళ్లలో దేశ జీడీపీకి ఒక శాతం అదనపు వాటా అందించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గుర్తు చేశారు.
దారి చూపిన ద్వితీయ, తృతీయ రంగాలు
తెలంగాణలో 2021-22లో పారిశ్రామిక, సేవా రంగాలు అద్భుతమైన ప్రగతి సాధించాయి. ద్వితీయ రంగం ప్రస్తుత ధర వద్ద 21.5శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. గత ఏడాది వృద్ది -0.3శాతంగా ఉంది. సేవా రంగం సైతం 18.3 శాతం వృద్ధి రేటు సాధించింది. గతేడాది ఈ వృద్ధి 0.9శాతం మాత్రమే.
Also Read: Dalit Bandhu Scheme: అందుకే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టాం - బడ్జెట్ స్పీచ్‌లో మంత్రి హరీష్ రావు ఏమన్నారంటే
Also Read: BJP MLAs Suspend: బీజేపీకి భారీ షాక్ ! ఈటల, రాజా సింగ్, రఘునందన్ రావులు సెషన్ మొత్తం సస్పెండ్