Telangana BJP Tickets : తెలంగాణ బీజేపీలో టిక్కెట్ సీజన్ - అప్లికేషన్లతో పార్టీ ఆఫీసుకు నేతల క్యూ !
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల అప్లికేషన్లను తీసుకోవడం ప్రారంభించారు. దీంతో నాంపల్లి బీజేపీ ఆఫీసు దగ్గర కోలాహలం ఏర్పడింది.
Telangana BJP Tickets : తెలంగాణ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ప్రారంభించింది. సోమవారం ఉదయం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఇందు కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఈ దరఖాస్తులను స్వీకరించనున్నారు. బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఇది సరికొత్త సంప్రదాయం. పార్టీ చరిత్రలోనే బీజేపీ పార్టీలో తొలిసారి అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకూ అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులు తీసుకోలేదు.
క్రిమినల్ కేసులు సహా మొత్తం వివరాలతో దరఖాస్తు
ఇతర పార్టీల్లో ఉన్న వారైనా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్టీలో ఏదైనా పదవిలో కొనసాగితే వాటి వివరాలతో పాటు సోషల్ మీడియా అకౌంట్ల సమాచారం కూడా కోరింది. దరఖాస్తు ప్రత్యేక ఫారంను మొత్తం నాలుగు విభాగాలుగా రూపొందించిన రాష్ట్ర నాయకత్వం.. మొదటి విభాగంలో వ్యక్తి బయోడేటా, చేసిన రాజకీయ కార్యక్రమలను అడుగుతోంది. ఇక రెండో విభాగంలో గతంలో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే, స్ధానిక సంస్థలు వివరాలు అందులో వచ్చిన ఓట్లను ప్రశ్నిస్తుంది. మూడో ప్రస్తుతం పార్టీలో నిర్వహిస్తున్న బాధ్యతలను అడుగుతుంది. చివరి నాలుగో విభాగంలో ఏమైన క్రిమినల్ కేసులు ఉంటే వాటి వివరాలు, శిక్షపడిన కేసులు వివరంగా పొందుపరచాలని కోరుతోంది.
మూడు దశల్లో వడపోత తర్వాత టిక్కెట్ ఖరారు
టిక్కెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను మూడు దశలో వడపోత చేపట్టనున్నారు. జిల్లా, రాష్ట్ర, కేంద్ర పార్టీ స్థాయిలో స్క్రీనింగ్ చేపట్టనున్నారు. ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకున్న తరువాత నియోజకవర్గాలవారీగా వచ్చిన అప్లికేషన్లను రాష్ర్ట నేతలు పరిశీలిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీనియర్ నేతలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను ఫైనల్ చేసి హైకమాండ్ కు పంపిస్తారు. రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఒక్కో సీటుకు భారీగా అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీలో చేరికలు కూడా పెద్దగా లేకపోడంతో దరఖాస్తు చేసుకునే వారికే ఎక్కువగా అవకాశాలులభిస్తాయన్న అంచనా ఉంది.
బీజేపీకి ఎంత నమ్మకంగా పని చేశారో కూడా చెప్పాల్సి ఉంటుంది !
దరఖాస్తు ఫామ్‌లో టిక్కెట్ కోరుకునే అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు కూడా వెల్లడించాలని కోరింది. అభ్యర్థిపై క్రిమినల్ కేసుల వివరాలు, ఒకవేళ శిక్ష పడి ఉండే వాటి వివరాలు తెలపాలని కోరారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నెంబర్‌తో పాటు ఏ సంవత్సరంలో పార్టీలో చేరారు, రాజకీయంగా చేపట్టిన కార్యక్రమాల వివరాలు ఏంటి? గతంలో ఎన్నికల్లో పోటీ చేస్తే వాటి వివరాలతో పాటు ఫలితాలు తెలపాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ కు యాభైవేల ఫీజు పెట్టింది. కానీ బీజేపీ అలాంటి ఫీజులేమీ పెట్టలేదని తెలుస్తోంది.