TS BJP Mission 90 : పార్టీలో చేరే వారికి గ్యారంటీ టిక్కెట్ - తెలంగాణ బీజేపీ "మిషన్ 90" స్టార్ట్ !
తెలంగాణ బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి మిషన్ 90 ప్రణాళిక సిద్ధం చేసుకుంది. పార్టీలో చేరే వారికి టిక్కెట్ హామీ ఇవ్వనున్నారు.
TS BJP Mission 90 : తెలంగాణ బీజేపీ మిషన్ 90 టార్గెట్ గా పెట్టుకుంది. తెలంగాణలో 90 నియోజకవర్గాల్లో గెలుపును లక్ష్యంగా పెట్టుకుని కార్యాచరణ ప్రారంభించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అధ్యక్షతన విస్తారక్‌ల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం లో తెలంగాణ అంశంపైనా చర్చించారు. తర్వాత విడిగా బీజేపీ ముఖ్యనేతలతో బీఎల్ సంతోష్ సమావేశం అయ్యారు. తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గనికి ఒక పాలక్, ఒక విస్తారక్‌ను బీజేపీ నియమించారు. పాలక్, విస్తారక్‌లతో సంతోష్ సమావేశం అయ్యారు. పార్టీ బలోపేతంపై సూచనలు ఇచ్చారు. బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా చర్చించనున్నారు. పార్టీలో చేరికలను వేగవంతం చేయాలని ఇప్పటికే కమలం పార్టీ నిర్ణయించింది.
45 నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత
తెలంగాణలో నియోజకవర్గాల్లో నాయకత్వ కొరత ఉన్నట్లుగా కేంద్ర బీజేపీకి స్పష్టమైన రిపోర్టు అందింది. దీంతో ఇతర పార్టీల్లోని సీనియర్ నేతలను ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు. 45 నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికి బీజేపీలో చేరేందుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో సీనియర్ నేతలకు టిక్కెట్లపై భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చి సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఈ మేరకు చేరికల కమిటీకి సందేశం ఇచ్చారు. పార్టీలో చేరుతామని వచ్చే వారికి.. టిక్కెట్ హామీ ఇద్దామని.. ఈ విషయాన్ని పార్టీ అగ్రనేతలతోనే చెప్పిద్దామని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అసంతృప్తి నేతలపై గురి
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరే వారు తగ్గిపోయారు. ఈ కారణంగా కాంగ్రెస్ నేతలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అసంతృప్తి ఎక్కువగా ఉంది. సీనియర్లు నేతలు పార్టీని ధిక్కరిస్తున్నారు. ఈ కారణంగా అలాంటి నేతల్లో నియోజకవర్గాల్లో పట్టు ఉన్న నేతలను ఆకర్షించాలని అనుకుంటున్నట్లుగా తెలు్సతోంది. మిషన్ 90లో సక్సెస్ సాధించాలంటే.. ఖచ్చితంగా వలసలు అవసరం అని బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చారు. ఇటీవలి కాలంలో బీజేపీకి ఊపు వచ్చినప్పటికీ.. బలమైన అభ్యర్థులు మాత్రం కనిపించడం లేదు.
ఎన్నికల వరకూ చేరికలపై ప్రత్యేక మిషన్
2023 చివరిలో జరగనున్న ఎన్నికల కోసం... మిషన్ 90లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నరాు. ఏడాది పాటు చేయనున్న కార్యక్రమాలు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అంశాలపై కసరత్తు ప్రారంభించారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇప్పటి నుండే ప్రజల్లో ఉండాలని కమలం పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజా అజెండాను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. పార్టీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ ప్రధానంగా తెలంగాణపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల పరిణామాలతో ఆయన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీని ఓడించడాన్ని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల వరకూ బీజేపీ కార్యక్రమాలు జోరుగా సాగనున్నాయి.