Kishan Reddy: 9 ఏళ్లుగా యువతకు అన్యాయం, నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం - కిషన్ రెడ్డి ఫైర్
Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి మరో సారి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి మరో సారి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను హైకోర్టు రద్దు చేయడంతో కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కనీసం పోటీ పరీక్షలను సైతం సరిగ్గా, పకడ్బందీగా నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శలు ఎక్కుపెట్టారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీఎస్‌పీఎస్సీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణలో 9 ఏళ్లుగా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదన్నారు.
లక్షలాది మంది అభ్యర్థులు అప్పులు చేసి కోచింగ్ తీసుకున్నారని మొదటి సారి గ్రూప్-1 పరీక్ష పేపర్ లీక్ అయ్యి, అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. తాజా హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను రెండో సారి రద్దు చేయడంతో నిరుద్యోగులు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది యువత సమయం, డబ్బు కోల్పోయారని సీఎం కేసీఆర్ దానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నరక కూపంగా మారిందని, కేసీఆర్ సర్కార్ తీరు వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడాల్సి వస్తోందని అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. పరీక్షలు నిర్వహించలేదని స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని ఆయన ఘాటు విమర్శలు చేశారు.
నిరుద్యోగులు అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్నారని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్టోబర్ 1న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సంస్థకు ఆయన శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం పాలమూరు నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారన్నారు.
వందే భారత్ ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి
కాచిగూడ - యశ్వంతపుర మధ్య వందే భారత్ ట్రైన్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కాచిగూడలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు వచ్చాయని ఇది మూడో ట్రైన్ అని తెలిపారు. కాచిగూడ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు మూడు రాష్ట్రాలను, 12 జిల్లాలను కలుపుతూ వెళ్తుందని చెప్పారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. అక్టోబర్ 1 తేదీ ప్రధాని మోదీ తెలంగాణకు రాబోతున్నట్లు చెప్పారు. ఆరోజు కూడా అనేక రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.
తెలంగాణకు రూ.4,418 కోట్లు
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిదిన్నరేండ్లలో ఏటా 55 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం చేపట్టినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ తక్కువగా ఉందని, ఈ విషయాన్ని మోదీ గుర్తించారని అందుకే అధిక రైల్వే ప్రాజెక్టులు తెలంగాణకు ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ ఏడాది రూ.4,418 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించారని తెలిపారు. తెలంగాణలో 31 వేల కోట్ల రూపాయల రైల్వే పనులు నిర్మాణంలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. దాదాపు రూ.2300 కోట్లతో రాష్ట్రంలో అనేక రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. 21 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని ఈ మధ్య వర్చువల్గా ప్రారంభించినట్లు తెలిపారు.
ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి
సికింద్రాబాద్ స్టేషన్‌కు రూ.717 కోట్ల కేటాయించి ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేస్తూ.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ఎలా ఉంటుందో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలా ఉండబోతోందన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయని, కాచిగూడ ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. చర్లపల్లిలో రూ.221 కోట్ల న్యూ టెర్మినల్ నిర్మాణం కాబోతోందని, కాజీపేటలో రైల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలవుతుందని. తర్వాత రైలుకు సంబంధించిన అన్ని ఉత్పత్తులు అక్కడ తయారవుతాయని కిషన్ రెడ్డి తెలిపారు.