Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్
Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ...రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గులాబీ బాస్ 115 నియెజకవర్గాలకు సీట్లు ప్రకటించి దూకుడు పెంచారు.
Telangana Assembly Elections 2023 :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ...రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గులాబీ బాస్ 115 నియెజకవర్గాలకు సీట్లు ప్రకటించి దూకుడు పెంచారు. ఆ పార్టీ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ కంటే వీలయినన్ని ఎక్కువ సీట్లు ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. హస్తం పార్టీలోని బీసీ వర్గానికి చెందిన నేతలు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని అధిష్ఠానంపై ఒత్తిడి చేస్తున్నారు.
వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకానుంది. ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల రచించడంలో నిమగ్నమయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు చెక్ పెట్టి...తెలంగాణలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోంది. అందుకు తగ్గట్టే కార్యాచరణను సిద్ధం చేసోంది. పార్టీలోని ముఖ్య నేతలు వీహెచ్, మదుయాష్కీ, మహేశ్‌కుమార్ గౌడ్, పొన్నాల, పొన్నం ప్రభాకర్ గౌడ్ వంటి నేతలు బీసీ నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా..ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనూ బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. బీసీ నేతలు తమ వాటా కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండటంతో...కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ సీట్ల కోసం భారీగా పోటీ నెలకొంది.
తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మధుయాష్కీ, వీహెచ్ వంటి నేతలు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం, బీఆర్‌ఎస్ కంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బీసీ నేతలకు టికెట్లు ఇవ్వటం కష్టంగా మారింది. కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరగడంతో, పలువురి నేతల టికెట్లు డైలామాలో పడిపోయాయి. ఇదే విషయాన్ని పార్టీలోని బీసీ నేతలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. కొత్తగా వచ్చే వారికి టికెట్లు ఇస్తే తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. ముందు నుంచి పార్టీని నమ్ముకున్న నేతలకు టికెట్లు ఇవ్వకపోతే...పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పొలిటికల్ అఫైర్స్ కమిటీలోనూ ఇదే విషయమై చర్చించి ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు కేటాయించాలని ఒత్తిడి చేశారు. ఇప్పటికే బీసీ నేతలు బలంగా పని చేసుకుంటున్న 40 నియోజకవర్గాల జాబితాను తయారు చేశారు. ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కాదని.. కొమ్మూరి ప్రతాపరెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆలోచన చేస్తోంది కాంగ్రెస్. హుస్నాబాద్‌పై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎల్బీనగర్ సీటుపై మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, నల్గొండ అసెంబ్లీ సీటుపై చెరుకు సుధాకర్ వంటి నేతలు ఆశలు పెట్టుకున్నారు.
రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాకు తగ్గట్టే అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని బీసీ నాయకులు పట్టుబడుతున్నారు. ప్రతిసారి గెలుపు గుర్రాల పేరుతో బీసీ నేతలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ఎన్నికల ముందే అలర్టయిన నేతలు...వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీసీ జనాభా ఎక్కువగా ఉన్న.. బీసీ నేతలు పని చేసుకుంటున్న నియోజకవర్గాలను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.